సర్ ప్రక్రియపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శలు

24-11-2026 | 03:53pm

కరీంనగర్ సిటీ, నవంబర్ 24 (విజయక్రాంతి): భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ‘సర్’ ప్రక్రియ పేరుతో కాలరాసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ప్రశ్నించే బడుగు, బలహీన వర్గాల ఓట్లను తొలగించడమే బీజేపీ లక్ష్యమని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ప్రశ్నించే వర్గాల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాదయాత్రల పేరుతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

ఓట్ల తొలగింపుపై పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్చకు ప్రయత్నిస్తే సమాధానం చెప్పకుండా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెనుకడుగు వేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీని చూసి బీజేపీ నాయకులు భయపడుతున్నారని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీల కుటుంబమని పేర్కొన్నారు.

దేవుళ్లను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయాలు (Political Politics) చేస్తోందని, యువతను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తోందని విమర్శించారు. దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేయాలని చెప్పే బీజేపీ నేతలు తమ కుటుంబాల విషయంలో ఎందుకు అదే వైఖరి అవలంబించడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చించి సీబీఐ విచారణకు ఆదేశించాలని నిర్ణయించిన నేపథ్యంలో, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ విచారణ కోసం ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. స్విస్ బ్యాంకుల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి పేదలకు ఇస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు.

బండి సంజయ్ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూ యువతను రెచ్చగొడుతున్నారని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. అందరి గుండెలు లబ్‌డబ్ అని కొట్టుకుంటే బండి సంజయ్ గుండె మాత్రమే జైశ్రీరామ్ అని కొట్టుకుంటుందా అని ప్రశ్నించారు. అందరి రక్తం ఎర్రగా ఉంటే బండి సంజయ్ రక్తం మాత్రమే కాషాయ రంగులో ఉంటుందా అంటూ వ్యాఖ్యానించారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని యువతకు బండి సంజయ్ చేసిన మేలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో చేసిన కృషి ఏమిటో వెల్లడించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర మంత్రిగా తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గల్ఫ్ బాధితుల సమస్యలను బండి సంజయ్ ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు. కరీంనగర్‌కు తీసుకొచ్చిన అభివృద్ధి నిధుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు.

నోరు ఉందని బండి సంజయ్ ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి చేసే వ్యాఖ్యల విషయంలో సంయమనం పాటించాలని సూచించారు. దేవుడి పేరుతో ఓట్లు అడగకుండా అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి ఎన్నికలకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు