ఈటల రాజేందర్‌కు పాడి కౌశిక్ రెడ్డి ఐదు సూటి ప్రశ్నలు
బహిరంగ చర్చకు సిద్ధమా?
హుజూరాబాద్ ప్రజల కష్టాల్లో కనిపించని మీరు..
ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరం
హుజురాబాద్,నవంబర్ 27:(విజయక్రాంతి) : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు(BJP MP Eatala Rajender) హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Paadi Kaushik Reddy) ఐదు సూటి ప్రశ్నలు సంధించారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై(Development of Huzurabad Constituency) బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈటల రాజేందర్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
హుజురాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ నియోజకవర్గ ప్రజలను వదిలిపెట్టకుండా వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో 2023లో తిరిగి విజయం సాధించానని, గెలిచినా ఓడినా హుజురాబాద్ ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఒక్కసారి ఓటమి ఎదురుకాగానే నియోజకవర్గాన్ని వదిలి గజ్వేల్, మల్కాజిగిరి(Gajwel, Malkajgiri) వైపు వెళ్లిన ఈటల ఇప్పుడు వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు.
ఈటల రాజేందర్‌కు ఐదు ప్రశ్నలు సంధిస్తూ.. రైతులు యూరియా(Farmers and urea), డీఏపీ కోసం చెప్పులు లైన్లలో పెట్టి గంటల తరబడి ఎదురుచూస్తున్నప్పుడు వారి పక్షాన ఎందుకు నిలబడలేదని ప్రశ్నించారు. సాగునీటి సమస్యలు, విద్యుత్ కోతలు, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోయిన సందర్భాల్లో రైతులకు ఎందుకు అండగా నిలవలేదని నిలదీశారు.
హుజురాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న డంపింగ్ యార్డు సమస్యపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలో వారి తరఫున పోరాటం చేయాల్సిన బాధ్యత లేదా అని అన్నారు.
వీణవంక మండలంలో కూలిపోయిన చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలపై కూడా ఈటల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుల ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయలతో మంజూరైన చెక్‌డ్యామ్‌ల కాంట్రాక్టులను ఈటల కుమారుడికి అప్పగించారని ఆరోపించారు. నిర్మాణాల నాణ్యతపై వస్తున్న ప్రశ్నలకు, ప్రజాధనంతో చేపట్టిన పనుల పరిస్థితిపై వివరణ ఇవ్వాలని కోరారు.
20 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈటల హుజురాబాద్‌కు చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని 107 గ్రామపంచాయతీల్లో రోడ్లు, మురుగు కాలువలు, వీధి దీపాలు, శ్మశానవాటికలు, గ్రామపంచాయతీ భవనాలు, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల అభివృద్ధి వంటి పనులు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు. తన ఇంటి ముందున్న బోర్నపల్లి, సూపర్ బజార్ రోడ్డును కూడా అభివృద్ధి చేయలేని మీరు.. బీజేపీ ఎంపీగా ఉన్న తర్వాత హుజురాబాద్‌లో తట్టెడు మట్టి పోసిన అభివృద్ధి పనైనా చూపించాలని సవాల్ విసిరారు.
ఓటర్ల సంఖ్యపై కూడా ఈటలకు కనీస అవగాహన లేదని విమర్శించారు. 2024లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 39,79,596 మంది ఓటర్లు ఉండగా, 70 లక్షలకు పైగా ఉన్నారని చెప్పడం సరికాదన్నారు. ఓటర్ల జాబితా సవరణ అనంతరం మల్కాజిగిరిలో 23,70,428 మంది, హుజురాబాద్ నియోజకవర్గంలో 2,25,734 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. 2023 ఎన్నికల సమయంలో 2,49,738 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం మూడు లక్షల మంది ఉన్నారని ఎలా చెబుతారని ప్రశ్నించారు.
కేసీఆర్(KCR) మళ్లీ ముఖ్యమంత్రి కాగానే హుజురాబాద్ నియోజకవర్గానికి రూ.1,000 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపిస్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. తాను రూ.1,000 కోట్లు తీసుకొస్తానని చెబితే, రూ.1,200 కోట్లు తీసుకొస్తానని చెప్పినట్లు ఈటల తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చేరాలు పోటీ చేస్తున్న చోట తన పార్టీ అభ్యర్థులెవరో చెప్పకుండా చేరాలుకే ఓటు వేయాలని ఈటల రాజేందర్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తన పార్టీ అభ్యర్థుల గురించి స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో ఈటల ఉన్నారని ఎద్దేవా చేశారు.
హుజురాబాద్ ప్రజల తరఫున అడిగిన ఐదు ప్రశ్నలకు ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గందె శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ సురేందర్ రెడ్డి, సర్పంచ్ మల్లారెడ్డి, కౌన్సిలర్ రవీందర్ రావు, సర్పంచులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.