తెలంగాణ సంస్కృతిపై కాంగ్రెస్‌కు చిన్నచూపు
వెంకటాపూర్, నవంబర్ 27 (విజయక్రాంతి): బతుకమ్మ చీరల పథకం(Bathukamma Sarees Scheme) పేరును ఇందిరమ్మ చీరలుగా మార్చడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి(Congress government) ఉన్న చిన్నచూపునకు నిదర్శనమని బీఆర్ఎస్ వెంకటాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు నర్ర భద్రయ్య విమర్శించారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ చేపట్టారని గుర్తుచేశారు. బతుకమ్మ అనేది కేవలం పండుగ కాదని, తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. పథకాల పేర్లు మార్చడంపై చూపుతున్న శ్రద్ధ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు.
ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు ఇచ్చిన హామీల నెరవేర్పు, యువతకు ఉపాధి, రైతులకు భరోసా కల్పించడంపై దృష్టి సారించాలని సూచించారు. బతుకమ్మ పేరును మార్చినంత మాత్రాన తెలంగాణ ప్రజల మనసుల్లో ఆ పండుగకు ఉన్న ప్రాధాన్యతను చెరిపేయలేరన్నారు. తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవాన్ని గౌరవించి బతుకమ్మ చీరల పథకం పేరును పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.