గిరిజన మహిళల నైపుణ్యాలకు గుర్తింపు..

27-11-2026 | 06:36pm
  1. మేడారం హస్తకళలకు ప్రత్యేక బ్రాండ్‌
  2. ఐటీడీఏ ఆధ్వర్యంలో శిక్షణ..
  3. ప్రత్యేక విక్రయ కేంద్రం ఏర్పాటు దిశగా ఐటీడీఏ
  4. గిరిజన మహిళల ఆర్థిక అభివృద్ధికి ఐటీడీఏ పీవో ప్రత్యేక శ్రద్ధ 

ములుగు, నవంబర్ 27 (విజయక్రాంతి): గిరిజన మహిళల్లో(Tribal women) దాగి ఉన్న సంప్రదాయ కళానైపుణ్యాలకు ఆధునికతను జోడించి, వాటిని ఆదాయ వనరులుగా మలిచేందుకు ములుగు జిల్లా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(Integrated Tribal Development Agency) కార్యాచరణ చేపడుతోంది. ఇందుకోసం ఐటీడీఏ పీవో ప్రత్యేకంగా దృష్టి సారించడంతో మలుగు ఏజెన్సీలోని ఆదివాసి మహిళలకు గుర్తింపు తో పాటు, ఆర్థిక అవకాశాలు మరింతగా అంది వచ్చే అవకాశం ఉంది.

మహిళలు తయారు చేసే వెదురు హస్తకళలు, అలంకరణ వస్తువులకు ప్రత్యేక గుర్తింపు కల్పించడంతో పాటు, మార్కెట్‌ అవకాశాలను అనుసంధానం చేసి స్థిరమైన ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ మేరకు శ్రీ సమ్మక్క సారలమ్మ మహిళా శక్తి సంఘాల సభ్యులతో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో ముఖాముఖి నిర్వహించి, వారు తయారు చేస్తున్న ఉత్పత్తులను పరిశీలించారు.

మహిళలు తయారు చేసే ప్రతి ఉత్పత్తిపై ‘శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలు – మేడారం’ పేరుతో ప్రత్యేక స్టిక్కర్‌, లోగో లేదా ట్యాగ్‌ ఏర్పాటు చేయాలని పీఓ సూచించారు. దీనివల్ల మేడారం హస్తకళలకు ప్రత్యేక బ్రాండ్‌ గుర్తింపు లభించడంతో పాటు, ఇతర ప్రాంతాల ఉత్పత్తుల నుంచి వీటిని ప్రత్యేకంగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.

వెదురుతో తయారు చేసే గృహోపకరణాలు, పెన్‌స్టాండ్లు, ఫొటో ఫ్రేములు, ల్యాంప్‌షేడ్లు, బుట్టలు, జ్ఞాపికలు, అలంకరణ వస్తువులను ఆధునిక డిజైన్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇందుకోసం మహిళా సంఘాల సభ్యులకు వెదురు హస్తకళలు, ఇతర చేతివృత్తుల తయారీలో నెలరోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందించాలని ఆదేశించారు.

ఉత్పత్తుల నాణ్యత, డిజైన్‌, ఫినిషింగ్‌, ప్యాకేజింగ్‌, ధర నిర్ణయం, మార్కెటింగ్‌ అంశాల్లోనూ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. శిక్షణ అనంతరం మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి ఐటీడీఏ ఆధ్వర్యంలో మేడారంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టారు. మేడారం దర్శనానికి వచ్చే భక్తులు, పర్యాటకులు స్థానిక మహిళల చేతిపనులను కొనుగోలు చేసేలా విక్రయ వ్యవస్థను రూపొందిస్తున్నారు.

గిరిజన మహిళల సంప్రదాయ నైపుణ్యాలను ఆధునిక మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దితే మేడారం ప్రాంతానికి ప్రత్యేకమైన హస్తకళా బ్రాండ్‌ రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మహిళలకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యం

గిరిజన మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్‌, ధరల వివరాలు, తయారీదారుల సంఘం గుర్తింపు ఉండేలా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. స్థానికంగా తయారీ, విక్రయ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ అవకాశాలను కూడా పరిశీలించాలని అధికారులకు సూచించాం.

కేవలం శిక్షణకే పరిమితం కాకుండా మహిళలు తమ నైపుణ్యంతో స్వయంగా ఆదాయం సంపాదించే స్థాయికి ఎదగాలని, వారి ఆర్థిక స్వావలంబనకు ఐటీడీఏ అండగా నిలుస్తుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్  టొప్పో తెలిపారు.

మరిన్ని వార్తలు