మంత్రి పొన్నం చొరవతో రైతులకు ప్రభుత్వం దసరా కానుక

21-10-2026 | 06:38pm
  1. - ఎస్సారెస్పీ ఇందిరమ్మ వరద కాలువ ప్యాకేజీ-3 పనులకు రూ.211.172 కోట్లతో పరిపాలనా ఆమోదం
  2. - కాలువల పటిష్టత, సీసీ లైనింగ్ పనులకు అదనంగా రూ.40.779 కోట్లతో కొత్త టెండర్లకు అనుమతి
  3. - హుస్నాబాద్ నియోజకవర్గంలో 38 బ్రిడ్జిల నిర్మాణం.. 22 గ్రామాల్లో 24,398 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం

కరీంనగర్ (విజయక్రాంతి): హుస్నాబాద్ నియోజకవర్గ(Husnabad Constituency) రైతాంగానికి సాగునీటి సౌకర్యాలు మరింత మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక అందించింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఇందిరమ్మ వరద కాలువ ప్యాకేజీ-3 పనులకు సంబంధించి ప్రభుత్వం జీవో నెం.518 ద్వారా కీలక పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

ఇందులో భాగంగా 211.172 కోట్లతో వేరియేషన్ ఎస్టిమేట్-IIకు పరిపాలనా ఆమోదం లభించగా, మరోవైపు ఎడమ, కుడి ప్రధాన కాలువల్లో సీసీ లైనింగ్, అదనపు నిర్మాణాల కోసం 40.779 కోట్లతో కొత్త టెండర్లు పిలిచేందుకు ప్రత్యేకంగా అనుమతి మంజూర అయింది. ఎంఎంఆర్ కుడి ప్రధాన కాలువ పరిధిలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో మొత్తం 38 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులతో 22 గ్రామాలకు చెందిన రైతులకు, మొత్తం 24,398 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరనుంది.

చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, ముదిమాణిక్యం, రామంచ, సీతారాంపూర్, రేకొండ, బొమ్మనపల్లి, పీచుపల్లి, చిన్న ముల్కనూర్ గ్రామాల్లో 19 బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఈ పరిధిలో 5,620 ఎకరాల ఆయకట్టు ఉంది. సైదాపూర్ మండలం దూదేనపల్లి, ఆకునూర్, పేర్కపల్లి, వెంకటేశ్వరపల్లి, ఘన్‌పూర్, బొమ్మకల్, అమ్మనగుర్తి, ఏక్లాస్‌పూర్, ఎలబోతారం, గొడిశాల, రాయికల్, సైదాపూర్, సోమారం, వెన్నంపల్లి గ్రామాల్లో మరో 19 బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఈ పరిధిలో 18,778 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చిగురు మామిడి, సైదాపూర్ రెండు మండలాల్లో కలిపి 38 బ్రిడ్జిల నిర్మాణంతో 22 గ్రామాల్లోని రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపడనున్నాయని తెలిపారు.

ఎం ఎం ఆర్ ప్యాకేజీ కింద పెండింగ్ పనులను ఏడాదిలోపు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రైతాంగ సంక్షేమానికి, సాగునీటి రంగ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఈ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి  కృతజ్ఞతలు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపడేలా నిరంతరం కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రాంతీయ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు