నేరుగా ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలి
కొత్తపల్లి, సెప్టెంబర్ 29(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్ట్ ఏజెన్సీలు(Contract agencies) వెట్టిచాకిరి చేయించుకుంటూ, చాలీచాలనీ జీతాలు ఇస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయని హాస్పిటల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏజెన్సీ వ్యవస్థలను తక్షణమే రద్దు చేసి, కార్మికుల కోసం నేరుగా ప్రభుత్వమే ఒక ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని లేదా కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్ పద్ధతిన ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైద్య విద్య సంచాలకులు (డిఎంఇ) డాక్టర్ వాణిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ వాణి స్పందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏజెన్సీ వ్యవస్థలను రద్దు చేసే దిశగా ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తోందని, అతి త్వరలోనే కార్మికులకు శుభవార్త చెబుతామని హామీ ఇచ్చారు. అలాగే కరీంనగర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరరెడ్డి గారితో ఫోన్‌లో మాట్లాడి, కార్మికులకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, నిబంధనలు పాటించకపోతే సదరు ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం బండారి శేఖర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కో బెడ్‌కు ₹7,500 చొప్పున ప్రభుత్వం నిధులు ఇస్తుండటంతో, ఏజెన్సీలు కార్మికులకు ₹11,000 కు మించి వేతనాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పీఎఫ్ యాజమాన్య వాటాను ఏజెన్సీలు చెల్లించకుండా, కార్మికుల జీతాల నుంచే పీఎఫ్, ఈఎస్ ఐ డబ్బులు వసూలు చేసి జమ చేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా, 1వ తేదీన ఇవ్వాల్సిన వేతనాలను నెలాఖరు వరకు ఆలస్యం చేస్తూ, అందులో కోతలు విధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారి డిమాండ్లు తెలుపుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మధ్యవర్తిగా ఉన్న ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి, ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా లేదా నేరుగా వేతనాలు చెల్లించాలి. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం సూత్రం ప్రకారం శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్, సూపర్ వైజర్ కార్మికులకు కనీస వేతనం ₹26,000/- గా నిర్ణయించాలి. (బెడ్ ఆధారిత ₹7,500 విధానాన్ని రద్దు చేయాలి). ఆలాగే ప్రతి నెల 1వ తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేతనాలు జమ చేయాలి. అదే విధంగా కార్మికులందరికీ పీఎఫ్ ,ఈఎస్ఐ సౌకర్యంతో పాటు పూర్తిస్థాయి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని అన్నారు. ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో యూనియన్ అధ్యక్షులు పి. అరుణ్, ప్రతినిధులు రాజు, సంపత్, నర్సింగం, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.