పేద కుటుంబానికి బియ్యం వితరణ చేసిన బాణాల లక్ష్మణ్

22-11-2026 | 07:50pm

ఖమ్మం టౌన్ నవంబర్ 22 (విజయక్రాంతి): గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన 46వ డివిజన్‌కు చెందిన చెన్నబోయిన శ్రీను కుటుంబానికి డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాణాల లక్ష్మణ్(Congress leader Banala Laxman) అండగా నిలిచారు. శ్రీను దశదిన కర్మల నిమిత్తం ఆయన కుటుంబ సభ్యులకు రెండు బస్తాల బియ్యాన్ని ఆదివారం వితరణగా అందజేశారు.

చెన్నబోయిన శ్రీను, ఆయన భార్య వెంకటమ్మ రోడ్డుపై బండి మీద కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించేవారు. అయితే కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్న శ్రీను మంచానికే పరిమితమయ్యారు. ఆయన పరిస్థితిని గుర్తించిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్ సహకారంతో ఇటీవల ప్రభుత్వ ద్వారా వికలాంగుల పింఛన్ మంజూరు చేయించారు. అయితే పింఛన్ మంజూరైన మరుసటి రోజే శ్రీను మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించిందని బాణాల లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

శ్రీనుతో తమకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని, ఆయన మృతి బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భవిష్యత్తులోనూ ఏ ఆపద వచ్చినా తోడుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి దేవర వెంకన్న, 46వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుపాకుల మధు, రేగు రవీందర్, సుధగాని మల్లికార్జునరావు, వట్టికూటి వీరప్రసాద్, చల్లా సైదులు, కొక్కిరేణి వెంకటేశ్వర్లు, అరూరి నరేష్, కంకల మహేష్, మలగ శ్రీకాంత్, మోటే సాయి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు