కల్తీ కల్లు విక్రయిస్తున్న వ్యక్తిపై పోలీసుల దాడి
60 కల్లు బాటిళ్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం.. ఇద్దరికి బీజెడ్ఓ పాజిటివ్
బోధన్, నవంబర్ 23 (విజయక్రాంతి): నిషేధిత మత్తు పదార్థమైన ఆల్ఫ్రాజోలం కలిపి కల్తీ కల్లు విక్రయిస్తున్న వ్యక్తిపై ఎడపల్లి పోలీసులు(Edapally Police) దాడి నిర్వహించి కేసు నమోదు చేశారు. ఈ దాడిలో 60 కల్లు బాటిళ్లతో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో కల్తీ కల్లు విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎడపల్లి ఎస్ఐ ఎం. రమ ఆధ్వర్యంలో, బోధన్ ఏసీపీ అనుమతితో పంచుల సమక్షంలో కల్లు దుకాణంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా కల్లు దుకాణం నిర్వహిస్తున్న గుర్రం నారాయణ గౌడ్ (68) కల్లులో నిషేధిత ఆల్ఫ్రాజోలం కలిపి గ్రామస్థులకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. తాను కల్లులో ఆల్ఫ్రాజోలం కలుపుతున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు పేర్కొన్నారు. దుకాణంలో తనిఖీలు నిర్వహించి 60 కల్లు బాటిళ్లు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అదే సమయంలో కల్లు సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులకు మూత్ర పరీక్షలు నిర్వహించగా, వారిద్దరికీ బెంజోడియాజిపైన్స్ (BZO) పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
కల్తీ కల్లుపై కఠిన చర్యలు
నిషేధిత మత్తు పదార్థాలు కలిపిన కల్తీ కల్లు విక్రయించడం, సేవించడం ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హానికరమని ఎడపల్లి ఎస్ఐ ఎం. రమ హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కల్తీ కల్లు విక్రయాలపై ప్రజలు సమాచారం అందించాలని కోరారు.