సినీ కళాకారుడు కామల్ల సుందర్‌కు ఇండియన్ గ్లోరీ అవార్డు

03-11-2026 | 04:34pm

హీరో సుమన్ చేతుల మీదుగా పురస్కారం ప్రదానం.. సుబ్లేడు గ్రామానికి గర్వకారణమంటూ గ్రామస్తుల హర్షం

తిరుమలాయపాలెం నవంబర్ 3 (విజయ క్రాంతి): తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, గాయకుడు, రచయిత, సినీ నటుడు, స్వర్ణ నంది అవార్డు గ్రహీత కామల్ల సుందర్(Swarna Nandi Award recipient Kamalla Sundar) ఇండియన్ గ్లోరీ అవార్డును(Indian Glory Award) అందుకున్నారు.

అక్టోబర్ 31న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో కళారత్న మూవీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు హీరో సుమన్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సుమారు 30 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న కామల్ల సుందర్ విద్యాబోధనతో పాటు విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు ప్రోత్సహిస్తున్నారు.

మరోవైపు గాయకుడిగా, రచయితగా, హాస్య నటుడిగా, వెండితెర నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మూఢనమ్మకాలు, అంటరానితనం, నిరక్షరాస్యత నిర్మూలనపై పాటలు, నటన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక చైతన్యం కల్పిస్తున్నారు. కళారంగంతో పాటు సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించిన కళారత్న మూవీస్ సంస్థ ఆయనను ఇండియన్ గ్లోరీ అవార్డుతో సత్కరించింది.

సుబ్లేడు గ్రామానికి చెందిన కామల్ల సుందర్‌కు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం గ్రామానికి గర్వకారణమని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన సాధించిన గుర్తింపు పట్ల కళాకారులు, ఉపాధ్యాయులు, మేధావులు, వివిధ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు