పోలీస్ శాఖలో పదోన్నతి శిక్షణ ప్రారంభం

03-11-2026 | 05:29pm
  1. నూతన నేర చట్టాలు, సైబర్ నేరాల దర్యాప్తుపై పట్టు సాధించాలి
  2. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం 

కరీంనగర్ క్రైం, నవంబర్ 03 (విజయక్రాంతి): పోలీస్ అధికారులు వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంలో క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం అత్యంత కీలకమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం(Karimnagar Police Commissioner Gouse Alam)  స్పష్టం చేశారు. కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (పీటీసీ)లో పోలీసు అధికారుల ప్రీ-ప్రమోషనల్ ట్రైనింగ్  ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, శిక్షణ తరగతులను సోమవారం అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలంటే శిక్షణను పూర్తి అంకితభావంతో, క్రమశిక్షణతో పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం లభించిన ఈ పదోన్నతి శిక్షణ అవకాశాన్ని అధికారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

నూతన నేర చట్టాలపై అవగాహన 

దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన నూతన చట్టాలైన భారతీయ న్యాయ సంహిత , భారతీయ నాగరిక్ సురక్ష సంహిత , భారతీయ సాక్ష్య అధినియం  లపై అధికారులు పూర్తి స్థాయి పట్టు సాధించాలని సూచించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సాంకేతిక సవాళ్లు, సైబర్ క్రైమ్స్, ఆర్థిక మోసాలు  వంటి ఆధునిక నేరాల దర్యాప్తు పద్ధతులపై లోతైన అధ్యయనం చేయాలన్నారు. సీసీటీఎన్ఎస్ వేదికలో చోటుచేసుకున్న నూతన మార్పులను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు.

నిత్య విధుల్లో వృత్తిపరమైన శిక్షణ, క్రమశిక్షణతో పాటు ఆర్థిక క్రమశిక్షణ  అలవర్చుకోవాలని తెలిపారు. శిక్షణా కాలంలో మద్యం సేవించడంపై పూర్తి నిషేధం ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పీటీసీ ప్రిన్సిపాల్ ఎం. పిచ్చయ్య మాట్లాడుతూ పీటీసీలో శిక్షణ పొందే అధికారుల కోసం బారక్స్, మెస్ వసతులతో పాటు కమిషనర్ గౌస్ ఆలం  ప్రత్యేక చొరవతో మెరుగైన మెడికల్ సదుపాయాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినట్లు తెలిపారు. శిక్షణార్థులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు.

ఈ శిక్షణలో సివిల్ విభాగం నుంచి ఏఎస్ఐ నుండి ఎస్ఐ  పదోన్నతి కోసం మొత్తం 315 మంది (280 మంది పురుషులు, 35 మంది మహిళలు) 3 నెలల పాటు శిక్షణ పొందనున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఏఆర్  విభాగానికి సంబంధించి ఏఆర్ఎస్ఐ  నుండి ఆర్ఎస్ఐ  పదోన్నతి కోసం 59 మంది అధికారులు నెల రోజులపాటు శిక్షణలో పాల్గొంటున్నారు. మొత్తంగా 374 మంది అధికారులు ఈ సమగ్ర శిక్షణా కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు.

ఈ ప్రారంభ కార్యక్రమంలో పీటీసీ వైస్ ప్రిన్సిపాల్స్  మల్లికార్జున్ , బి. గంగాధర్  లతో పాటు డీఎస్పీలు పి. శివరామయ్య, జి. విజయపాల్ రెడ్డి, బి. నారాయణ, కె. నాగేశ్వరరావు మరియు ఇతర శిక్షణా విభాగ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు