పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా ఆయుధపూజ!

21-10-2026 | 11:11am

ఖమ్మం, అక్టోబర్ 21 (విజయక్రాంతి): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిటీ అర్ముడ్ రిజర్వ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో (Police Headquarters) ఆయుధపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఈ కార్యక్రమంలో పాల్గొని పోలీస్ శాఖకు చెందిన ఆయుధాలు, వాహనాలకు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతీకగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సునీల్ దత్ పోలీస్ సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.

పోలీస్ శాఖలో ఆయుధపూజ (Ayudha Pooja) సంప్రదాయంలో భాగంగా ఆయుధాలు, వాహనాలకు పూజలు నిర్వహించడం ఆనవాయితీ. విధి నిర్వహణలో ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, బాధ్యతాయుతంగా సేవలందించాలని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏఆర్ అడిషనల్ డీసీపీలు కుమారస్వామి, విజయబాబు, ఏఆర్ ఏసీపీలు నర్సయ్య, సుశీల్ సింగ్, ఎస్బీ ఏసీపీ మహేష్, ఆర్‌ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్, సాంబశివరావు, ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ, శంకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు