మురసు తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన వరి పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
సత్తుపల్లి, నవంబర్ 04 ( విజయ క్రాంతి ): మురసు తుఫాన్(Murasu cyclone) ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట పొలాలు నీట మునిగాయి. దీంతో పంటలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్(MLA Dr. Matta Ragamayi Dayanand) క్షేత్రస్థాయిలో పర్యటించి, నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని, పంటలకు జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. తుఫాన్ కారణంగా ఎదురైన ఇబ్బందులు, పంట నష్టానికి సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, రైతులకు అండగా నిలవడం, పంట నష్టాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, నష్టాన్ని అంచనా వేసేలా చర్యలు చేపట్టడం వంటి అంశాలపై దృష్టి సారించారు.
రైతులకు అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ భరోసా కల్పించారు...ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు...