జనగణనలో ఓబీసీ కాలమ్ ఏర్పాటు చేయాలి

04-11-2026 | 08:57pm

- జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి 

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణనలో ప్రత్యేకంగా ఓబీసీ కాలం చేర్చి కులానికి ఒక యూనిక్ కోడ్ పెట్టాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి(National BC Rights Forum) నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని ఇస్లాంపూర్ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా సమగ్రంగా బీసీ కులగణన చేపట్టకపోవడం విచారకరమన్నారు.

ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా కులగణన చేపడతామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం నిర్వహిస్తున్న జనగణనలో ప్రత్యేకంగా ఓబీసీ కాలం ఏర్పాటు చేయకపోవడం బీసీ సమాజానికి అన్యాయం చేయడమేనని విమర్శించారు. జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చి బీసీల జనాభా లెక్కలు సేకరిస్తే, జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగ రంగాల్లో తగిన అవకాశాలు కల్పించాల్సి వస్తుందనే ఉద్దేశంతో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారా అని ప్రశ్నించారు. దేశంలోని అన్ని వర్గాల జనాభా వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వాలు బీసీల విషయంలో మాత్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. బీసీలకు రావాల్సిన సామాజిక, రాజకీయ వాటాను ఇంకా ఎన్నాళ్లు దూరం చేస్తారన్నారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వనికి సిఫార్సులు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి పక్షాన జాతీయ బీసీ కమిషన్ చైర్‌పర్సన్ సాధ్వి నిరంజన్ జ్యోతికి బహిరంగ లేఖ పంపామని, ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చడంతో పాటు ప్రతి బీసీ కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్‌ను, బీసీ సమాజ ఉద్యమ ఆకాంక్షను గుర్తించి జనగణనలో ఓబీసీ కాలమ్ ఏర్పాటు చేసి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పెద్దల్ల చంద్రకాంత్, రాష్ట్ర నాయకులు గజ్జల వెంకటయ్య, కడారి సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు