మురుసు తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి

04-11-2026 | 09:03pm
  1. పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించాలి: మాజీ ఎంపీ నామ
  2. నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి: మాజీ ఎంపీ నామ
  3. రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలి: మాజీ ఎంపీ నామ

ఖమ్మం, నవంబర్ 4(విజయక్రాంతి): మురుసు తుఫాన్(Murusu cyclone) ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి, పత్తి, ఇతర సాగు పంటలు తీవ్రంగా దెబ్బతినడం పట్ల బీఆర్ఎస్, మాజీ లోక్ సభ పక్ష నేత ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు(Ex-MP Nama Nageswara Rao) ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటలు వర్షాల కారణంగా నీటమునిగి, నేలకొరిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు.

జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులతో పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి, నష్టాన్ని అంచనా వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పంటలు దెబ్బతిన్న ప్రతి రైతును గుర్తించి, నష్టపరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే పెట్టుబడుల భారం, సాగు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రకృతి వైపరీత్యం మరింత నష్టాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు.  రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టి, వారికి అండగా నిలవాలని నామ కోరారు.

మరిన్ని వార్తలు