కేంద్ర,రాష్ట్ర విధానాలతో ప్రభుత్వ విద్య బలహీనం
- విద్యా వ్యతిరేక విధానాలపై పోరు
- ఈనెల17న హైదరాబాద్లో సామూహిక నిరాహార దీక్షలు – టీఎస్ యూటీఎఫ్
సింగరేణి అక్టోబర్ 15 విజయ క్రాంతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల(Central and state governments) విధానాలతో ప్రభుత్వ విద్య బలహీనమటంతోపాటు ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతోందని టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బానోత్ రాందాస్(TSUTF District Secretary Banoth Ramdas) ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మండల కమిటీ సమావేశంలో టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో మండల అధ్యక్షులు కేవీ కృష్ణారావు అధ్యక్షతన జరిగింది.
ఈసమావేశంలో బానోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం-2020లో ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే అంశాలను ఉపసంహరించాలని, పాఠశాలల విలీనం, మూసివేతలను నిలిపివేసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలకు నష్టం కలిగించే జీవో 25ను సవరించాలని, ఉపాధ్యాయులను బోధనా విధులకే పరిమితం చేసి బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలన్నారు.
తాత్కాలిక, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను సామాజిక భద్రతతో క్రమబద్ధీకరించాలని, కేజీబీవీ, యూఆర్ఎస్, ఎస్ఎస్, టీడబ్ల్యూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రెండో పీఆర్సీ నివేదికను తెప్పించి వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఏలు ,బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సక్రమంగా అమలు చేసి అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని, మోడల్ స్కూళ్లు, గురుకులాలకు 010 పద్దును అమలు చేయాలని, ఆదాయపు పన్ను స్లాబ్లను సవరించి ఉద్యోగులపై పన్ను భారాన్ని తగ్గించాలని కోరారు. విద్య వ్యతిరేకవిధానాలపై పోరు బాటలో నడవాలన్నారు.
డిమాండ్ల సాధన కోసం 17న జరిగే సామూహిక నిరాహార దీక్షల్లో సింగరేణి మండలంలోని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యుడు ఫణికుమార్, మండల ప్రధాన కార్యదర్శి బానోత్ మంగీలాల్, ఉపాధ్యక్షులు నాగలక్ష్మి, పవన్ కళ్యాణ్, కోశాధికారి నాగేశ్వరరావు, ఆడిటర్ రాంబాబు, ఎఫ్డబ్ల్యూఎఫ్ కన్వీనర్ నాగేశ్వరరావు, కార్యదర్శులు సంతులాల్,శి వకోటి, రామారావు, సుజాత, నరేంద్ర, కిరణ్, బాలకృష్ణ, స్రవంతి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.