సర్పంచ్, ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు

15-10-2026 | 11:40pm

నిర్మల్,(విజయక్రాంతి): కుంటాల మండలం(Kuntala Mandal) కల్లూర్ గ్రామ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో చోటుచేసుకున్న నిధుల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) గురువారం తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.5,85,933 గ్రామ పంచాయతీ నిధులను(Gram Panchayat funds) సర్పంచ్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు మళ్లించడం జరిగిందని చెప్పారు. అలాగే  1,85,043 రూపాయల 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేయడాన్ని విచారణ నివేదిక ద్వారా గుర్తించామన్నారు.

గ్రామసభ ముందస్తు అనుమతి లేకుండా, కొటేషన్లు, టెండర్ నిబంధనలు పాటించకుండా పనులు చేపట్టడంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టామన్నారు. ఈ విచారణ ఆధారంగా సర్పంచ్ పెంట దశరథ్, ఉపసర్పంచ్ సూర్యవంశీ నారాయణలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వారు సమర్పించిన వివరణలను పరిశీలించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

వారి వివరణ అసంతృప్తికరంగా ఉండడంతో పాటు ఆర్థిక అక్రమాలు నిర్ధారణ కావడంతో పంచాయతీ రాజ్ చట్టం రూల్ 42(1) (జి.ఓ.ఎం.ఎస్. నం. 30, తేదీ: 20.01.1995) ప్రకారం సర్పంచ్ పెంట దశరథ్, అలాగే చెక్కులపై ఉమ్మడి సంతకాలు చేసినందున ఉపసర్పంచ్ సూర్యవంశీ నారాయణల చెక్ పవర్లను తక్షణమే అమలులోకి వచ్చేలా ఆరు నెలల పాటు నిలిపివేస్తూ (ఫ్రీజ్) చర్యలు తీసుకున్నామని అన్నారు.  

గ్రామ పంచాయతీలో అత్యవసర పరిస్థితులు, అభివృద్ధి పనుల నిమిత్తం కల్లూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, కుంటాల మండల పంచాయతీ అధికారి ఉమ్మడి సంతకాలతో నిధులు ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడినా, నియమ నిబంధనలు ఉల్లంఘించినా సహించేది లేదని, ప్రతి పైసా పారదర్శకంగా ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని కలెక్టర్ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు