అంగన్వాడీలో పెచ్చులు ఊడి ఐదుగురికి గాయాలు
ఆసిఫాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్(Ankushapur)లోని తేలివాడ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారులు మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో భవనం స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారులు అప్రమత్తమై పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.
బాధితులను పరామర్శించిన కలెక్టర్ హరిత..
ప్రమాద విషయం తెలుసుకున్న కలెక్టర్ హరిత ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న చిన్నారులు, మహిళలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి ఎక్స్‌రే, స్కానింగ్ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓ బాలిక కాలికి పట్టీ వేశారని, ఓ మహిళకు ఎనిమిది కుట్లు పడ్డాయని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.అంగన్వాడీ భవనం పరిస్థితి, ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో పరిశీలన చేపడతామని కలెక్టర్ తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు.