పగలు ఎండ.. రాత్రి చలి!

09-10-2026 | 05:10am

విచిత్ర వాతావరణంతో ప్రజల అవస్థలు.. 

పంటలపై రైతుల ఆందోళన

కౌటాల, అక్టోబర్ 8 (విజయక్రాంతి): పగటిపూట ఎండ తీవ్రత, రాత్రివేళ చలి పెరుగుతుండటంతో కౌటాల మండలం(Kouthala Mandal)లో వాతావరణం అనూహ్యంగా మారుతోంది. ఉదయం చలి వాతావరణం ఉండగా.. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత పెరుగుతోంది. రాత్రి మళ్లీ చలి మొదలవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో సాగునీటి కొరత నెలకొనగా. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పగటి ఎండతో పొలాల్లో తేమ వేగంగా ఆవిరైపోతుండటంతో పంటలకు నీటి అవసరం పెరుగుతోంది. దీంతో బోర్లు, మోటార్లపై రైతులు ఆధారపడాల్సి వస్తోంది.

పంటలపై ప్రభావం ఉంటుందేమోనని ఆందోళన..

రాత్రి, తెల్లవారుజామున చలి పెరుగుతుండటంతో పంటలపై ప్రభావం ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా తెగుళ్లు, పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఎరువులు, పురుగు మందుల ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు పంట నష్టాలు ఎదురైతే పెట్టుబడి భారం మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రజలకూ తప్పని ఇబ్బందులు..

వాతావరణ మార్పులతో సామాన్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజామున చలితో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతుండగా.. పగటిపూట ఎండలో వ్యవసాయ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. పంటల పరిస్థితిని పరిశీలించి రైతులకు అవసరమైన సూచనలు, జాగ్రత్తలను వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేయాలని రైతులు కోరుతున్నారు. వర్షాభావ పరిస్థితులకు తోడు వాతావరణ మార్పులతో పంటలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు