ఎన్‌హెచ్‌ఏఐ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి

27-11-2026 | 12:43pm

అధికారులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదేశం

క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (NHAI) ఆధ్వర్యంలో చేపట్టిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎన్‌హెచ్‌ఏఐ, సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి మండలాల్లో పెండింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రతి పనిని ప్రాధాన్యత క్రమంలో చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బస్‌స్టాప్‌లు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.ఆసిఫాబాద్ మండలంలో గుండి రోడ్డు, శివాజీ చౌక్ రోడ్డు, అయ్యప్ప ఆలయం సమీపంలోని రోడ్డు, కల్వర్టు పనులు, మోడల్ స్కూల్, బూరుగూడ, ఖమన్, ఇప్పలనవేగం వద్ద బస్‌స్టాప్‌ల ఏర్పాటు, సర్వీస్ రోడ్డు, పోచమ్మ ఆలయ నిర్మాణం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

రెబ్బెన మండలంలోని ఖైర్గాం, కొండపల్లి, నేర్పల్లి, ఇంద్రనగర్, పుంజిమెరగూడ, తక్కళ్లపల్లి గ్రామాల్లో బస్‌స్టాప్‌ల ఏర్పాటు, సర్వీస్ రోడ్డు, విద్యుత్ స్తంభాలు, బారికేడ్లు, జూనియర్ కళాశాల వద్ద ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం, రెబ్బెన కేంద్రంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులను పరిశీలించారు.వాంకిడి మండలంలోని బెండార గ్రామంలో డిగ్రీ కళాశాల వద్ద బస్‌స్టాప్‌లు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి, ఇందాని రోడ్డు, జైత్‌పూర్, రాజీవ్‌నగర్, గణేశ్‌పూర్ ప్రాంతాల్లో బస్‌స్టాప్‌ల ఏర్పాటు, బంబార గ్రామంలో బస్‌స్టాప్‌లు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి, వాంకిడి గ్రామపంచాయతీలో డ్రైనేజీ మరమ్మతులు, గోయగాం గ్రామంలో నాగదేవత, భీమన్న ఆలయాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, మండల నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు