ఆసిఫాబాద్‌లో సేవా జ్యోతి యాత్ర

07-10-2026 | 04:00pm

ఆసిఫాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా పరిపాలనను పూర్తిచేసుకున్న సందర్భంగా  బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప సభ(Seva Sankalp Sabha), సేవా జ్యోతి యాత్ర(Seva Jyoti Yatra) నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్‌లో జరిగిన సభకు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని లైవ్‌స్ట్రీమింగ్ ద్వారా నాయకులు, కార్యకర్తలు వీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం వికసిత్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడుతూ మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లు దాటాయని, ప్రతి వ్యక్తిపై రూ.2.5 లక్షల అప్పు ఉందన్నారు. గత 12 ఏళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు.

అనంతరం వడ్డేపల్లి గార్డెన్ నుంచి కోర్టు చౌరస్తా వరకు సేవా జ్యోతి కాగడాలతో ప్రదర్శన నిర్వహించి, జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరిగెల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులు కోవ విజయ్, అరిగెల మల్లికార్జున్ యాదవ్, డా. శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నార వనజ, కొట్నాక విజయ్‌తో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు