ఏఐతోనే భవిష్యత్

03-11-2026 | 05:15am
  1. అన్ని రంగాల్లో టెక్నాలజీకి పెద్దపీట
  2. రెండేళ్లలో బీఆర్‌ఎస్ అధికారంలోకి..
  3. ప్రభుత్వ శాఖలన్నింటికీ ఏఐ అనుసంధానం
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి) : ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) (ఏఐ) యుగంలోకి అడుగుపెడుతోందని, రాబోయే కాలంలో అన్ని రంగాల్లో ఏఐ(AI) కీలక పాత్ర పోషిం చనుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పేర్కొన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి(Technology) అనుగుణంగా యువత తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని, కొత్త ఆవిష్కరణలతో ముం దుకు సాగాలని పిలుపునిచ్చారు. సోమవారం నానక్‌రాంగూడలోని షెరటాన్ హోటల్లో క్యాంపస్ హబ్ ఏఐ ప్రొడక్ట్‌ను(Campus Hub AI Product) ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన నలుగురు యువకులు కలిసి క్యాంపస్ హబ్ ఏఐని ప్రారంభించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ నలుగురు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. యువత గొప్పగా ఆలోచించాలని, లక్ష్యాలను నిర్దేశించుకుని గొప్పగా ఎదగాలని సూచించారు. గతంలో తెలంగాణలో ఐటీ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏఐ వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో రాష్ట్రం కూడా అదే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

నేటి విద్యా వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలకంగా మారిందని పేర్కొన్నారు. ఏఐని ఒక భూతంలా చూడాల్సిన అవసరం లేదని, అది మానవాళికి ఉపయోగపడే దూతలాంటిదని వ్యాఖ్యానించారు. సాంకేతికతను సరైన రీతిలో వినియోగించుకుంటే సమాజంలో అనేక సానుకూల మా ర్పులు తీసుకురావచ్చన్నారు. ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని, అదే తరహాలో భవిష్యత్తులో ఏఐ మన జీవితాల్లో కీలక మార్పులు తీసుకురా బోతోందని చెప్పారు.

ఇప్పటికే డ్రైవర్‌లెస్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయని గుర్తుచేశారు. గతంలోనే వ్యవసాయ రం గంలో ఏఐ ద్వారా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించామని వివరించారు. సిరిసిల్లలోని ఓ గ్రామంలో ఏఐ ఆధారిత వ్యవసాయ ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు. రైతులకు పంటల సాగుపై సరైన అవగాహన కల్పించడంతోపాటు, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ’ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్’ కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు.

వ్యవసాయం నుంచి విద్య, వైద్యం, పరిశ్రమలు, పరిపాలన వరకు అవసరమైన ప్రతి రంగంలో ఏఐని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్ మాత్రమే కేంద్రంగా ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పరకాలలో రాకేష్ అనే యువకుడు ఐటీ కంపెనీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు, ప్రయత్నా లను ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించారు.

తెలంగాణ వ్యాప్తంగా ఐటీ రంగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని, పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల యువతకు కూ డా సాంకేతిక రంగంలో అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. ఏఐ సాంకేతికతను అవసరమైన చోట మాత్రమే వినియోగించాలని, దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. ప్రభు త్వం కూడా ఏఐ ఆధారిత ఆవిష్కరణలకు ప్రో త్సాహం అందించాలని కోరారు. తెలంగాణలో రెండేళ్ల తర్వాత బీఆర్‌ఎస్ అధికారం లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తర్వాత అన్ని ప్రభుత్వ శాఖలకు ఏఐ సాంకేతికతను అనుసంధానం చేస్తామని ప్రకటించారు. 

మరిన్ని వార్తలు