ఖజానాకు నిండు ధనం!

03-11-2026 | 05:35am

వాణిజ్య పన్నుల ఆదాయం జోష్

  1. అక్టోబర్‌లో రూ.7,738 కోట్ల వసూళ్లు
  2. గత ఏడాదితో పోలిస్తే 22 శాతం వృద్ధి
  3. ఒక్క నెలలోనే ఆదనంగా రూ.1,406 కోట్ల్లు
  4. జీఎస్టీ కంటే వ్యాట్ వసూళ్లలోనే అధికం
  5.    31 శాతం పెరిగిన వ్యాట్ ఆదాయం

నవంబర్ 2 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల(Telangana State Commercial Taxes) ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కీలకమైన పన్నుల వసూళ్లలో సానుకూల ధోరణి కనిపిస్తోంది. వస్తు సేవల పన్ను(Goods and Services Tax)(జీఎస్టీ), విలువ ఆధారిత పన్ను(Value-added tax)(వ్యాట్), వృత్తి పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానా కు సమకూరుతున్న ఆదాయం గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అక్టోబర్ నెలలో నమోదైన వసూళ్లు రాష్ట్ర వాణిజ్య కార్యకలాపాలు, వినియోగ వ్యయం, పన్నుల వసూళ్లలో పెరుగుతున్న ఆదాయ సరళిని స్పష్టం చేస్తున్నాయి.

2025 అక్టోబర్‌తో పోలిస్తే 2026 అక్టోబర్‌లో మొత్తం వాణిజ్య పన్నుల ఆదాయం 22 శాతం పెరిగి రూ.7,738 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే నెలలో రూ.6,332 కోట్ల ఆదాయం మాత్రమే నమోదైంది. అంటే ఒక్క నెలలోనే రూ.1,406 కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. అక్టోబర్ వసూళ్లలో జీఎస్టీ ప్రధాన వాటాను కలిగి ఉంది. ఈ నెలలో జీఎస్టీ రూపంలో రూ.4,593 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో రూ.3,914 కోట్లుగా ఉన్న ఈ ఆదాయం ఈసారి రూ.679 కోట్లు పెరిగింది. మొత్తంగా 17 శాతం వృద్ధి నమోదైంది.

రాష్ట్రంలో వస్తు, సేవల కొనుగోళ్లు, వ్యాపార లావాదేవీలు, వివిధ రంగాల్లో జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాల ద్వారా జీఎస్టీ వసూళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. అక్టోబర్ నెల గణాంకాలు జీఎస్టీ ఆదాయంలో స్థిరమైన వృద్ధి కొనసాగుతున్నట్లు సూచిస్తున్నాయి. జీఎస్టీతో పోలిస్తే వ్యాట్ వసూళ్లలో మరింత గణనీయమైన పెరుగుదల నమోదైంది. గత ఏడాది అక్టోబర్‌లో రూ.2,342 కోట్లుగా ఉన్న వ్యాట్ ఆదాయం ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.3,065 కోట్లకు చేరింది.

అంటే రూ.723 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. వృద్ధి శాతం 31గా నమోదైంది. అక్టోబర్ నెలలో మూడు ప్రధాన పన్నుల విభాగాల్లో అత్యధిక వృద్ధి వ్యాట్లోనే కనిపించడం గమనార్హం. పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం వంటి వ్యాట్ పరిధిలోకి వచ్చే వస్తువుల విక్రయాలు, వాటిపై విధించే పన్నుల వసూళ్లు ఈ ఆదాయంలో కీలకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వ్యాట్ ఆదాయంలో నమోదైన పెరుగుదల ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏడు నెలల్లో రూ.52 వేల కోట్లు!

వృత్తి పన్ను వసూళ్లు కూడా స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది అక్టోబర్లో రూ.76 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది రూ.80 కోట్లకు చేరింది. రూ.4 కోట్ల అదనపు ఆదాయంతో 5 శాతం వృద్ధి నమోదైంది. జీఎస్టీ, వ్యాట్‌తో పోలిస్తే వృత్తి పన్ను వాటా తక్కువగా ఉన్నప్పటికీ, ఈ విభాగంలోనూ ఆదాయం పెరగడం గమనార్హం. ఒక్క అక్టోబర్ నెలలోనే కాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లోనూ తెలంగాణ వాణిజ్య పన్నుల ఆదాయం మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. 2026 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మొత్తం రూ.52,113 కోట్ల ఆదాయం సమకూరింది.

గత ఏడాది ఇదే కాలంలో రూ.44,598 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఈ ఏడాది ఏడు నెలల్లో రూ.7,515 కోట్ల అదనపు ఆదాయం లభించింది. గత ఏడాదితో పోలిస్తే 17 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడు నెలల కాలంలో జీఎస్టీ ద్వారా రూ.29,630 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.24,974 కోట్లుగా ఉన్న వసూళ్లు ఈసారి రూ.4,656 కోట్లు పెరిగాయి. దీంతో జీఎస్టీ ఆదాయంలో 19 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం వాణిజ్య పన్నుల ఆదాయంలో జీఎస్టీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వ్యాట్ వసూళ్లు రూ.21,893 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో రూ.19,049 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి రూ.2,844 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. వ్యాట్ ఆదాయంలో 15 శాతం వృద్ధి నమోదైంది. ఇక వృత్తి పన్ను ద్వారా గత ఏడాది ఏడు నెలల్లో రూ.575 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ.590 కోట్లకు పెరిగింది. రూ.15 కోట్ల అదనపు ఆదాయంతో 3 శాతం వృద్ధి నమోదైంది.

ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతాలు..

ఏడు నెలల మొత్తం వసూళ్లను పరిశీలిస్తే జీఎస్టీ, వ్యాట్ రెండూ రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరులుగా కొనసాగుతున్నాయి. రూ.52,113 కోట్ల మొత్తం వాణిజ్య పన్నుల ఆదాయంలో జీఎస్టీ వాటా రూ.29,630 కోట్లు కాగా, వ్యాట్ వాటా రూ.21,893 కోట్లు. ఈ రెండు పన్నుల నుంచే రూ.51,523 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే మొత్తం వాణిజ్య పన్నుల ఆదాయంలో దాదాపు 99 శాతం ఈ రెండు విభాగాల నుంచే వస్తోంది. అదనపు ఆదాయం విషయంలోనూ జీఎస్టీ ముందంజలో ఉంది.

ఏడు నెలల్లో వచ్చిన రూ.7,515 కోట్ల అదనపు ఆదాయంలో జీఎస్టీ వాటా రూ.4,656 కోట్లు కాగా, వ్యాట్ వాటా రూ.2,844 కోట్లు. మిగిలిన రూ.15 కోట్లు వృత్తి పన్ను ద్వారా వచ్చాయి. అంటే అదనపు ఆదాయ వృద్ధికి జీఎస్టీ, వ్యాట్ రెండూ కీలకంగా దోహదం చేశాయి. వాణిజ్య పన్నుల వసూళ్లు పెరగడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతంగా భావించవచ్చు. పన్నుల వసూళ్లలో వృద్ధి నమోదైతే ప్రభుత్వానికి అందుబాటులో ఉండే సొంత ఆదాయ వనరులు బలోపేతమవుతాయి.

తద్వారా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ నిర్వహణ వ్యయాలకు అవసరమైన నిధుల సమీకరణలో వెసులుబాటు లభిస్తుంది. అయితే పన్నుల వసూళ్ల పెరుగుదల ఒక్కటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అంచనా వేయడానికి సరిపోదు. ప్రభుత్వ వ్యయాలు, అప్పులు, మూలధన పెట్టుబడులు, ఇతర ఆదాయ వనరులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

మొత్తంగా అక్టోబర్ నెలలో 22 శాతం, ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 17 శాతం వృద్ధి నమోదు కావడం తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖకు ప్రోత్సాహకర పరిణామం. ముఖ్యంగా ఏడు నెలల్లోనే గత ఏడాదితో పోలిస్తే రూ.7,515 కోట్ల అదనపు ఆదాయం సమకూరడం రాష్ట్ర ఖజానాకు ఊరటనిచ్చే అంశం. మిగిలిన ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే వృద్ధి ధోరణి కొనసాగితే రాష్ట్ర సొంత ఆదాయ వనరులు మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు