సింగరేణికి ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు
- జాతీయస్థాయిలో ఐదు గనులకు..
- కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే అవార్డుల ప్రదానం
- స్వీకరించిన సీఎండీ బుద్ద ప్రకాష్ జ్యోతి
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): ఉత్తమ మైనింగ్ పద్ధతుల అమలు, పర్యావరణహిత చర్యలు(Environment-friendly actions), కార్మికుల సంక్షేమం, సౌకర్యాల కల్పనలో ఉత్తమ కంపెనీగా ఉన్న సింగరేణి సంస్థ(Singareni Company) 2024-25 ఆర్థిక సంవత్సరానికి జాతీయస్థాయిలో 5 బొగ్గు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్‌ను(Five-star rating) సాధించింది. సోమవారం చత్తీస్‌గఢ్ రాయపూర్‌లో(Raipur, Chhattisgarh) అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే చేతుల మీదుగా సింగరేణి సంస్థ సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ఈ అవార్డులను అందుకున్నారు.
అవార్డులను అందుకున్న గనులలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్టీ, ఆర్కే-6 ఇంక్లైన్, సత్తుపల్లి ఏరియాకు చెందిన జేవీఆర్ ఓసీ--2, బెల్లంపల్లి ఏరియాకు చెందిన ఖైరీగూఢ ఓసీ, రామగుండం-- 3కి చెందిన ఆర్జీఓసీ--1 గనులు ఉన్నాయి. ఈ గనుల నిర్వహణ, పర్యావరణ చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు, ఉత్పత్తి సాంకేతికత వంటి అంశాలలో ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందు వల్లే ఈ అవార్డులు సాధించుకోవడం జరిగిందని సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి తెలిపారు.
సింగరేణిలో ఐదు గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించడంపై సింగరేణి అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభినందించారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి రాష్ట్ర ప్రతిష్టను పెంచాలన్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సింగరేణి సంస్థ డైరెక్టర్ కే వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్ టి.శ్రీనివాస్, రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ ఎస్.మధుసూదన్, శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీనివాస్, బెల్లంపల్లి ఏరియా ఏజీఎం నరేందర్, సత్తుపల్లి జేవీఆర్ ఓసీ-2 మేనేజర్ రాజేశ్వర్, ఆర్కే న్యూటెక్ మేనేజర్ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.