మార్కె ట్లకు ఏఐ ఆహ్వానం!
దేశానికే ఆదర్శంగా తెలంగాణలో డిజిటల్ యార్డులు
మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి రైతుకు డీజీ సేవలు
ఏఐ ఏర్పాటుకు వారం రోజుల్లో టెండర్ల ఆహ్వానం
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సమీక్ష
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి) : దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) (ఏఐ) ఆధారిత డిజిటల్ మార్కెట్ వ్యవస్థను(Digital market-based system) అందుబాటులోకి తీసుకురావాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు(Thummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు. రైతుల(Farmers') పండించిన పంటలకు సరైన ధర లభించడంతో పాటు, మార్కెట్లలో క్రయవిక్రయాలు పూర్తి పారదర్శకంగా జరిగేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని మంత్రి సూచించారు.
సోమవారం సచివాలయంలో మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి శ్రీధర్‌బాబుతో(Sridhar Babu) కలిసి సమీక్ష నిర్వహించారు. రైతు మార్కెట్ యార్డులోకి ప్రవేశించినప్పటి నుంచి బయటకు వెళ్లే వరకు ప్రతి దశను ఒకే డిజిటల్ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. రైతు వివరాల నమోదు, ప్రతి పంట లాట్ ఐడీ కేటాయింపు, డిజిటల్ బిడ్డింగ్ లేదా టెండర్ నమోదు, పంట నాణ్యత పరీక్ష, ఆన్లైన్ వేలం, ధర నిర్ణయం, రైతు అంగీకారం, పంట తూకం, అమ్మకపు బిల్లుల తయారీ, మార్కెట్ ఛార్జీల లెక్కింపు, రైతులకు చెల్లింపులు, గేట్ ఎగ్జిట్ నమోదు, ఈ- ఈ- పర్మిట్ల జారీ వరకు ఒకే వేదికపై నిర్వహించేలా వ్యవస్థను రూపొందించాలని తుమ్మల సూచిం చారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న డిజిటల్ మార్కెట్ వ్యవస్థలను అధ్యయనం చేసి, వాటికంటే మెరుగైన సాంకేతికతను తీసుకురావాలని చెప్పారు. మార్కె టింగ్ శాఖ అధికారుల హాజరు, బయోమెట్రిక్ అటెండెన్స్‌ను కూడా ఈ వ్యవస్థలో భాగం చేయాలని సూచించారు. ఐటీ శాఖతో సమన్వయం చేసుకొని, వారం రోజుల్లోగా టెండర్లు పిలిచే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
మార్కెట్ యార్డుల్లో డిజిటల్ వ్యవస్థతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు, గోదాముల నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి చెప్పా రు. యార్డుల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా వివిధ పంటలకు లభిస్తున్న ధరలను ప్రదర్శించాలన్నారు. అధికంగా వ్యాపార లావాదేవీలు జరిగే మార్కెట్ యార్డుల్లో తొలుత ఈ సదుపాయాలను ఏర్పాటు చేసి, క్రమంగా ఇతర మార్కెట్లకు విస్తరిం చాలని తెలిపారు.
కోహెడ ఫ్రూట్ మార్కెట్ పనుల్లో వేగం పెంచాలి
కోహెడ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మొదటి దశను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు చెప్పారు. టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ సంస్థ ప్రతినిధులు సూచించిన భూమి చదును సవరణలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తీసుకొని, వచ్చే వారం రోజుల్లోగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెటిం గ్ డైరెక్టర్ రాహుల్ రాజ్, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.