నకిలీ ఓట్లు తొలగించవద్దా?

03-11-2026 | 05:35am

రాహుల్ బాబా, రేవంత్ ఎంత గింజుకున్నా చొరబాటుదారులను ఓటర్ల జాబితాలో ఉండబోనివ్వం

ఎస్‌ఐఆర్, ఈవీఎంలపై చర్చకు కాంగ్రెస్ సిద్ధమా? 

తెలంగాణ నుంచి ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు 

కాంగ్రెస్ అరాచక సర్కారును కూకటివేళ్లతో పెకిలించి బీజేపీని గెలిపించాలి 

ఈవీఎంలతో తెలంగాణ, కేరళం, తమిళనాడులో బీజేపీయేతర ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయి?

హైదరాబాద్‌లో బీజేపీ మహాపాదయాత్ర ముగింపు సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగం 

పాల్గొన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు

నవంబర్ 2 (విజయక్రాంతి): కాంగ్రెస్‌ది ‘ఓట్ బచావో’ ర్యాలీ కాదు.. ‘ఘుస్‌పైఠియా (చొరబాటుదారుల) బచావో’ ర్యాలీ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Shah) అన్నారు.  చొరబాటుదారులను ఓటర్ల జాబితా(Voter List) నుంచి తొలగించవద్దా? అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ బాబా, రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎంత గింజుకున్నా ఒక్క అక్రమ చొరబాటుదారుడినీ ఓటర్ల జాబితాలో ఉండబోనివ్వమని తేల్చి చెప్పారు. బోగస్ ఓట్లు తొలగిస్తుంటే రాహుల్ గాంధీకి(Rahul Gandhi) కడుపుమంట ఎందుకు? అని ప్రశ్నించారు.

సోమవారం హైదరాబాద్‌లో ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకత్వాన్ని అంతం చేద్దాం’ అనే పేరుతో బీజేపీ మహా పాదయాత్ర చేపట్టింది. ఈ యాత్ర నిజాం కాలేజీ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర నుంచి మొజాంజాహీ మార్కెట్ వరకు కొనసాగింది. ఈ మహా పాదయాత్రలో పాల్గొన్న వేలాది మంది పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ జెండా పట్టుకుని ముందుకు నడిచారు. అనంతరం ఎంజే మార్కెట్ కూడలి వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని.. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీపై అమిత్ షా నిప్పులు చెరుగుతూ.. అది ‘ఓట్ బచావో’ ర్యాలీ కాదని, పచ్చిగా చొరబాటుదారులను కాపాడే ర్యాలీ అని కొట్టిపారేశారు. దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించారని రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. ఈ 13 కోట్లలో దాదాపు 6.5 కోట్ల ఓట్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వారివన్నారు. పైగా అందులో దాదాపు 3 కోట్ల మంది చనిపోయినవారి ఓట్లున్నాయని, చనిపోయినవారి పేరిట కాంగ్రెస్ బోగస్ ఓటింగ్ చేయాలని చూస్తోందన్నారు.

మరో కోటి ఓట్లు డూప్లికేట్ ఎంట్రీలు ఉన్నవని, మిగిలిన 3 కోట్ల ఓట్లు దేశంలో ఉనికిలోనే లేని బంగ్లాదేశ్ చొరబాటుదారులవని వెల్లడించారు. ఈ నకిలీ, చొరబాటుదారుల ఓట్లను కాపాడేందుకే రాహుల్ గాంధీ గగ్గోలు పెడుతున్నారన్నారు. ఎస్‌ఐఆర్, ఈవీఎంలపై చర్చకు కాంగ్రెస్ సిద్ధమా అని సవాల్ చేశారు. 

తెలంగాణను ఏటీఎంలా మార్చి ఆర్‌ఆర్ (రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అరాచక సర్కారును కూకటివేళ్లతో పెకిలించి బీజేపీని గెలిపించాలని, అందుకు కార్యకర్తలు పిడికిలి బిగించి సంకల్పం తీసుకోవాలని, రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని పిలుపునిచ్చారు.  ఎస్‌ఐఆర్ వల్లే బీజేపీ గెలుస్తోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనని చెప్పారు.

2014, 2019లలో ఎస్‌ఐఆర్ లేకుండానే దేశ ప్రజలు నరేంద్ర మోదీకి సంపూర్ణ మెజారిటీ ఇచ్చారని, 2024 తర్వాత హర్యానా, మహారాష్ట్రల్లో భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఈవీఎంల వల్ల బీజేపీ గెలుస్తోందని కాంగ్రెస్ నెపం మోపడంపై ఎద్దేవా చేస్తూ.. గెలిస్తే ప్రజలు గెలిపించినట్టు, ఓడితే ఈవీఎంలను నిందించడం ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లుందన్నారు.

ఈవీఎంలే కారణమైతే తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచింది?.. తమిళనాడు, కేరళంలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయని ప్రశ్నించారు. ఎస్‌ఐఆర్, ఈవీఎంలపై చర్చకు తాము సిద్ధమని, కాంగ్రెస్‌కు దమ్ముంటే పార్లమెంటులో చర్చకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. మాక్ పార్లమెంట్‌లో తప్ప రాహుల్  ఎప్పటికీ దేశానికి ప్రధాని కాలేరని విమర్శించారు. 

సత్తా బీఆర్‌ఎస్, ఎంఐఎంకు లేదు...

తెలంగాణను రేవంత్ రెడ్డి సర్కారు ఢిల్లీ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మార్చిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో నిస్సిగ్గుగా ‘ఆర్‌ఆర్ ట్యాక్స్’ (రాహుల్ ట్యాక్స్) వసూలు చేస్తున్నారని, ప్రజల సొమ్మును దోచుకుని ఢిల్లీ కాంగ్రెస్‌కి మూటలు పంపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన గ్యారెంటీలు అమలుకాక కుప్పకూలిపోయాయని, 10 ఏళ్ల యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన చరిత్ర కాంగ్రెస్‌దని నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా దేశాన్ని అగ్రపథాన నడిపిస్తున్నారని కొనియాడారు.

తెలంగాణలో కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకునే సత్తా బీఆర్‌ఎస్, ఎంఐఎంలకు లేదని, కాంగ్రెస్ అవినీతిపై పోరాడి ప్రజలకు న్యాయం చేసే ఏకైక శక్తి బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సాగనంపి, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కార్యకర్తలు సమరశంఖం పూరించాలని అమిత్ షా పిలుపునిచ్చారు. కొన్నేళ్లుగా దేశంలో బీజేపీకి ఆదరణ పెరుగుతుందని, కాంగ్రెస్ పార్టీని దేశమంతా ఛీకొడుతోందన్నారు. ఎస్‌ఐఆర్ జరగకముందు అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, బిహార్, బెంగాల్, అస్సాంలో గెలిచామన్నారు.

సర్దార్  పటేల్ లేకుంటే.. హైదరాబాద్ సంస్థానానికి విముక్తి అయ్యేది కాదన్నారు. అమిత్‌షా తన ప్రసంగం మధ్య మధ్యలో పార్టీ శ్రేణులను ఉత్సహాపరిచేలా మాట్లాడారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు మెంబర్ డా.కే లక్ష్మణ్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, గోడం నగేశ్, రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 

అమిత్‌షా పాదయాత్ర సక్సెస్ 

కేంద్ర మంత్రి బండి సంజయ్

అమిత్ షా మహా పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యిందని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. పాదయాత్ర అనంతరం సోమవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. సర్‌ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ కూటమికి చెంప దెబ్బ ఈ మహాపాదయాత్ర అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు కళ్లు తెరవాలని హితవు పలికారు. సర్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని, లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని హెచ్చరించారు. 

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్‌షా 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షాకు ఆలయ నిర్వాహకులు, పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమిత్ షా వెంట రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ చందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో పాటు పార్టీ శ్రేణులు ఉన్నారు.

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ సందర్శనం తర్వాత ఆయన హోటల్ ఐటీసీ కాకతీయకు వెళ్లి.. భోజన విరామం అనంతరం పారిశ్రామికవేత్త మై హోం రామేశ్వరరావు, ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఛైర్మన్‌తోపాటు పార్టీ నాయకులతో అమిత్ షా సమావేశమైనట్లు తెలిసింది. ఇందులో తాజా రాజకీయాలు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అయితే ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమని తెలిసింది. ఇదిలా ఉంటే అమిత్‌షా హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత తాను పాదయాత్రలో పాల్గొంటున్నానని ట్వీట్ చేశారు. సభ అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వెళ్లారు.

మరిన్ని వార్తలు