అండాల దందాపై సర్కారు ప్రత్యేక ఫోకస్
- 27 ఏఆర్టీ కేంద్రాల్లో అధికారుల ముమ్మర తనిఖీలు
- ఏడు ఐవీఎఫ్ ఆసుపత్రుల్లో 13 నిబంధనల ఉల్లంఘనల గుర్తింపు
- షోకాజ్ నోటీసులు జారీ
- వైద్యులు, దళారుల పాత్రపై ముమ్మర విచారణ..
- 31మంది మహిళల గుర్తింపు
- కేంద్ర నేషనల్ ఏఆర్టీ రిజిస్ట్రీని కలిసిన తెలంగాణ వైద్య అధికారులు
- స్పందించిన మహిళా కమిషన్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1౧ (విజయక్రాంతి): రాష్ట్రంలో ఐవీఎఫ్, ఏఆర్టీ కేంద్రాల(IVF and ART centers) ముసుగులో సాగుతున్న అక్రమ అండాల సేకరణ(Illegal egg collection) దందాపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ(Telangana Health and Medical Department) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలు, వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Raja Narasimha) ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు(Medical and Health Department officials) రాష్ట్రవ్యాప్తంగా ఐవీఎఫ్ కేంద్రాలపై(IVF centers) విస్తృత తనిఖీలు చేపట్టారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు గుర్తించిన 44 ఏఆర్టీ కేంద్రాలకు గాను 27 కేంద్రాల్లో అధికారులు తనిఖీలు పూర్తి చేశారు. ఈ తనిఖీల్లో ఏడు ఆసుపత్రుల్లో 13 రకాల నిబంధనల ఉల్లంఘనలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మిగిలిన కేంద్రాల్లో తనిఖీలు శరవేగంగా కొనసాగుతున్నా యి. ఈ అక్రమ వ్యవహారంలో ఇప్పటివరకు 31 మంది బాధితులైన మహిళలను అధికారులు గుర్తించారు.
ఈ దందాలో వైద్యులు, ఐవీఎఫ్ కేంద్రాలయాజమాన్యాలు,దళారులు ఎంతవరకు భాగస్వామ్య మయ్యారనే కోణంలో సమగ్ర విచారణ జరుగుతోంది. పోలీసుల స్వాధీనంలో ఉన్న రికార్డులతో పాటు నేషనల్ ఏఆర్టీ అండ్ సరోగసీ రిజిస్ట్రీ నుంచి అందే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బాధ్యులపై తదుపరి చట్ట పరమైన చర్యలు తీసుకోనున్నారు.
ఈ వ్యవహారంపై మరింత లోతుగా సమాచారం సేకరించేందుకు నవంబర్ 6న వైద్య అధికారు లు న్యూఢిల్లీలోని నేషనల్ ఏఆర్టీ అండ్ సరోగసీ రిజిస్ట్రీని సందర్శించారు. తెలంగాణలో నమోదైన ఏఆర్టీ కేంద్రాలు, ఏఆర్టీ బ్యాంకుల పూర్తి డేటాను కోరగా, త్వరలోనే సమాచారాన్ని అందజేస్తామని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (నైస్ ) ప్రతినిధులు హామీ ఇచ్చారు.
ఏ ఆర్ టీ చట్టం 2021 నిబంధనలు..
’అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్ - 2021’ ప్రకారం మహిళల నుంచి అక్రమంగా, ఆర్థిక ఆశచూపి అండాలను సేకరించడం తీవ్రమైన శిక్షార్హమైన నేరం. చట్టం ప్రకారం.అండం దానం చేసే మహిళ వయస్సు 23 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఒక మహిళ తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే అండ దానం చేయడానికి అనుమతి ఉంది. ఏఆర్టీ బ్యాంకులు లేదా క్లినిక్లు దాతలకు నగదు రూపంలో చెల్లింపులు చేయకూడదు (కేవలం బీమా, రవాణా ఖర్చులు మాత్రమే వర్తిస్తాయి).ప్రతి ఏఆర్టీ క్లినిక్ మరియు బ్యాంక్ తప్పనిసరిగా జాతీయ/రాష్ట్ర రిజిస్ట్రేషన్ ప్రాధికార సంస్థ వద్ద నమోదు చేసుకోవాలి.
మహిళా కమిషన్ ఆగ్రహం..
హైదరాబాదులోని పలు ప్రైవేట్ ఫెర్టిలిటీ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అండాల దందాపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. చైర్పర్సన్ నేరెళ్ల శారద అక్రమాలకు పాల్పడుతున్న సెంటర్లకు ప్రత్యేక నోటీసులు జారీ చేసి, సం బంధిత వైద్యాధికారుల నుంచి సమగ్ర వివరణ కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసు కోవాలని, కేంద్రాల అనుమతులు రద్దు చే యాలని ఆదేశించారు. మహిళల ఆరోగ్యం, హక్కుల పరిరక్షణకు మహిళా కమిషన్ కట్టుబడి ఉందని, మోసపూరిత వ్యాపారాలను సహించేది లేదన్నారు. బాధితులకు న్యా యం జరిగే వరకు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కొనసాగుతుందని తెలిపారు.
ఆరోగ్య శాఖ అధికారుల విజ్ఞప్తి..
పేదరికం లేదా మధ్యవర్తుల ప్రలోభాలకు లోనై అక్రమ వైద్య విధానాలకు బలికావద్దని మహిళలకు వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. మీ పరిధిలో ఎక్కడైనా అనధికారిక అండాల సేకరణ లేదా దళారుల దందా జరుగుతున్నట్లు తెలిస్తే, వెంటనే సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరింది.