రైతు బజారుగా కేసముద్రం మార్కెట్..!
- వ్యాపారి కంటే ముందే.. రైతు పంటకు వినియోగదారుడి క్యూ
- కల్తీ భయంతో ‘రైతు నుంచి నేరుగా’ కొనుగోళ్లకు మొగ్గు
- తాజా పంటలకు డిమాండ్.. రైతుకు లభిస్తున్న గిట్టుబాటు ధర
- కేసముద్రం మార్కెట్లో కనిపిస్తున్న వినూత్న కొనుగోలు ధోరణి
కేసముద్రం, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ఆహార పదార్థాల కల్తీపై ప్రజల్లో ఆందోళన పెరుగుతున్న వేళ.. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో(Procurement of agricultural produce) వినూత్న మార్పు కనిపిస్తోంది. మార్కెట్కు రైతులు తీసుకొచ్చిన పంటను వ్యాపారులు కొనుగోలు చేయకముందే వినియోగదారులు నేరుగా రైతుల వద్దకు చేరుకుని కొనుగోలు చేస్తున్న పరిస్థితి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో కనిపిస్తోంది. రైతు చెమటతో పండించిన పంటపై వినియోగదారులకు పెరుగుతున్న నమ్మకానికి ఇది నిదర్శనంగా మారుతోంది.
కల్తీ భయంతో రైతు పంటకే ప్రాధాన్యం
ప్రస్తుతం మార్కెట్లో లభించే ఆహార పదార్థాల నాణ్యతపై వినియోగదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ, రసాయనాల వినియోగం, నిల్వల సమయంలో నాణ్యత తగ్గడం వంటి కారణాలతో వీలైనంత వరకు నేరుగా రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మార్కెట్కు వచ్చిన తాజా పంటను పరిశీలించి నచ్చిన ఉత్పత్తులను అక్కడికక్కడే కొనుగోలు చేస్తున్నారు.
వ్యాపారి రాకముందే.. వినియోగదారుడి కొనుగోలు
సాధారణంగా రైతులు మార్కెట్కు పంట ఉత్పత్తిని తీసుకొచ్చిన తర్వాత వ్యాపారులు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తారు. అయితే కేసముద్రం మార్కెట్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. రైతులు ఆహార పదార్థాలకు సంబంధించిన పంట ఉత్పత్తుల బస్తాలను మార్కెట్కు తీసుకొచ్చిన వెంటనే స్థానిక వినియోగదారులు వాటిని పరిశీలిస్తూ కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. దీంతో వ్యాపారుల టెండర్ కు ముందే ముందుగానే కొందరు రైతులు మార్కెట్కు విక్రయానికి తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి.
రైతుకూ.. వినియోగదారుడికీ లాభమే.!
రైతు నుంచి నేరుగా కొనుగోలు చేయడం వల్ల మధ్యవర్తిత్వం కొంత మేర తగ్గే అవకాశం ఉంది. వినియోగదారుడికి తాజాగా, నాణ్యమైన ఆహార ఉత్పత్తిని ఎంచుకునే అవకాశం లభిస్తుండగా.. రైతుకు కూడా తన పంటకు మెరుగైన ధర లభించే పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆహార పంటలైన వేరుశనగ, పెసర్లు, కందులు, మినుములు, బొబ్బర్లు, పసుపు పంటలకు రైతులు ఆశించిన స్థాయిలో ధర పొందే అవకాశం పెరుగుతోంది.
పంట నాణ్యతే ప్రధాన ఆకర్షణ
రైతు పొలం నుంచి నేరుగా వచ్చిన పంటను కళ్లముందే చూసి కొనుగోలు చేసే అవకాశం వినియోగదారులను ఆకర్షిస్తోంది. పంట రంగు, పరిమాణం, తాజాదనం, నాణ్యత వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి కొనుగోలు చేయడంతో వినియోగదారుల్లో నమ్మకం పెరుగుతోంది. మరోవైపు తమ ఉత్పత్తికి వినియోగదారుల నుంచి నేరుగా డిమాండ్ రావడం రైతుల్లోనూ ఉత్సాహాన్ని నింపుతోంది. కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులను పండించి విక్రయానికి తెచ్చిన కొందరు రైతులకు ఈ రకమైన కొనుగోళ్లతో ఆశించిన గిట్టుబాటు ధర లభించడం వల్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
‘రైతు బజార్’ తరహా విధానానికి అవకాశం
కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో కనిపిస్తున్న ఈ పరిణామాన్ని వ్యవసాయ ఉత్పత్తుల ప్రత్యక్ష విక్రయాలకు ఒక అవకాశంగా భావించవచ్చు. రైతులకు ప్రత్యేకంగా విక్రయ వేదికలు, వినియోగదారులకు ప్రత్యక్ష కొనుగోలు సౌకర్యాలు కల్పిస్తే ఈ విధానం మరింత విస్తరించే అవకాశం ఉంది. దీంతో రైతుకు గిట్టుబాటు ధర, వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తి.. ఇద్దరికీ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. మొత్తంగా..
కల్తీ ఆహారంపై పెరుగుతున్న అప్రమత్తత నేపథ్యంలో ‘రైతు పంట.. వినియోగదారుడి నమ్మకం’ అనే కొత్త ధోరణి కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో కనిపిస్తోంది. వ్యాపారి కోసం ఎదురుచూడకుండా రైతు వద్దకే వినియోగదారుడు చేరడం.. రైతు శ్రమకు ప్రత్యక్షంగా విలువ కట్టే కొత్త మార్కెట్ సంస్కృతికి సంకేతంగా నిలుస్తోంది.