ఖైరతాబాద్‌లో ఓడుతారనే భయం

05-10-2026 | 05:20am
  1. అందుకే ఉప ఎన్నికను అడ్డుకుంటున్నారు
  2. దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి పోటీ చేయాలి
  3. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ప్రజలు బుద్ధి చెప్పాలి
  4. ఖైరతాబాద్‌లో విజయం బీజేపీదే
  5. బీజేపీ ఎంపీ డీకే అరుణ 

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకోవడంతోనే ఎన్నిక జరగకుండా అడ్డుకునేందుకు పిటిషన్లు వేయించారని బీజేపీ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna ) విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్,

అధికారంలోకి రాగానే సిగ్గులేకుండా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుందని డీకే అరుణ ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఫిరాయించిన ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీకి చెందినవారమో ప్రజలకు చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్‌తో ఎంపీ డీకే అరుణ ఆదివారం భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎన్‌రోల్‌మెంట్, సేవా సంకల్ప్ అభియాన్ తదితర అంశాలపై చర్చించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తాము బ్రహ్మాండమైన పాలన అందిస్తున్నామని, అన్ని హామీలను అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు.. మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగడానికి సిగ్గు ఎందుకు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు మళ్లీ గెలుస్తామనే నమ్మకం ఉంటే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలందరితో తక్షణమే రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికల్లో పోటీ చేయించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి, సిగ్గు లేకుండా కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ విసిరారు.

ఖైరతాబాద్‌లో బీజేపీ విజయం ఖాయం

గతంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుందని, రాబోయే రోజుల్లో కూడా అక్కడ బీజేపీ ఘన విజయం సాధిస్తుందనే విశ్వాసం తమకు ఉందని డీకే అరుణ స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీల వైఖరిని అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి పక్షపాతం చూపకుండా రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారని ఆమె గుర్తుచేశారు.

తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండింటి పాలనను చూశారని.. ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు వేర్వేరు కాదని, లోపాయికారి ఒప్పందంతో పని చేస్తున్న ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని విమర్శించారు.

అభివృద్ధిని కుంటుపరిచిన ఈ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో కర్ణాటక సహా ఇన్‌చార్జి కాసం వెంకటేశ్వర్లు, ఎంపీ గోడెం నగేశ్, నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


మరిన్ని వార్తలు