అభివృద్ధినే ఆదరిస్తారు

05-10-2026 | 05:20am
  1. పనులు చేసిన వారినే ప్రజలు గుర్తిస్తారు
  2. మైనారిటీల సంక్షేమాన్ని మరిచిన కాంగ్రెస్
  3. 4 వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని మోసం: మాజీ మంత్రి హరీశ్‌రావు
  4. గజ్వేల్‌లో కాశ కార్మికులకు పనిముట్ల పంపిణీ

గజ్వేల్, అక్టోబర్ 4: కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజల కండ్లముందే కనిపిస్తున్నదని, పనులు చేసిన వారినే ప్రజలు గుర్తిస్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao ) అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో తెలంగాణ తురక కాశ సంక్షేమానికి చేయూత కార్యక్రమంలో భాగంగా ఆదివారం నియోజకవర్గంలోని 90 మంది కాశ కార్మికులకు స్టోన్ కటింగ్ మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

కాంగ్రెస్ ప్రభు త్వం మైనారిటీల సంక్షేమానికి ఏటా రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఇస్తామన్న హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో మైనారిటీల సంక్షేమానికి రూ.1,800 కోట్ల వరకు ఖర్చు చేశామని తెలిపారు. మైనారిటీ గురుకులాలు, విదేశీ విద్య స్కాలర్‌షిప్‌లు, మైనారిటీ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ ఉద్యోగుల జీతాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని, కల్యాణలక్ష్మి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేయకుండా మల్లన్నసాగర్‌లో మిగిలిన పనులు పూర్తి చేసి, కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తి ప్రాజెక్టుకు నీరందించాలని కోరారు.

మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ అభివృద్ధికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలు మరువరని, ప్రజల సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు