బార్ అండ్ రెస్టారెంట్లు మూత
- లైసెన్స్ ఫీజు, నిబంధనలపై అసోసియేషన్ నిరసన
- ఎక్సైజ్ కమిషనరేట్ ముట్టడికి పిలుపు
హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి) : రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం బార్ అండ్ రెస్టారెంట్లు బంద్(Bars and restaurants closed) చేయనున్నారు. లైసెన్స్ ఫీజు, నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బార్ అండ్ రెస్టారెంట్ల అసోసియేషన్ ఎక్సైజ్ కమిషనరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 1,200 బార్ అండ్ రెస్టారెంట్లు మూత పడనున్నాయి.
ప్రివిలేజ్ ఫీజుతో పాటు బార్ స్లాబ్‌ను 8 శాతం నుంచి 20 శాతానికి, లైసెన్స్ ఫీజు రూ.40 లక్షల నుంచి రూ.44 లక్షలకు పెంచాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అసోసియేషన్.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
ఒక్కో బార్‌పై దాదాపు 60 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, ప్రభుత్వ తాజా నిర్ణయాల వల్ల వేలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే తామంతా తీవ్ర నష్టాల్లో ఉన్నామని బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా లైసెన్స్ ఫీజును దాదాపు రూ.33 లక్షల నుంచి రూ.56 లక్షల వరకూ చెల్లిస్తున్నామని, ప్రివిలేజ్ ఫీజుతో తమపై అదనంగా రూ.30 లక్షల భారం పడుతుందని వాపోయారు. గతంలో ఎన్నడూ లేని ఇలాంటి ఫీజు లేదని,
ఇప్పుడెందుకు నిర్ణయించారో అర్థంకావడం లేదన్నారు. అదే విధంగా వైన్‌షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లు ఇవ్వడం వల్ల తమకు నష్టం కలుగుతుందని, ఈ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ కమిషనరేట్‌ను ముట్టడికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు తరలిరావాలని అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు.