సినిమాను మీకళ్లతో చూస్తున్నా సర్!
అందం, అభినయం, అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్న యువ కథానాయకి భాగ్యశ్రీ బోర్సే(Young actress Bhagyashri Borse). టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందిపుచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ‘లెనిన్’(Lenin) సినిమాలో అఖిల్ అక్కినేని సరసన ఆకట్టుకుంది. ఇప్పుడీ బ్యూటీ ఏకంగా మలయాళ సీనియర్ స్టార్ మోహన్‌లాల్‌తో నటించే అవకాశం దక్కించుకుంది. భాగ్యశ్రీ మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడీ విషయాన్ని ఆమే అధికారికంగా వెల్లడించింది. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆపరేషన్ గంగా’ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే ఆయన పక్కన హీరోయిన్‌గా నటించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు మోహన్‌లాల్‌తో కలిసి దిగిన ఒక ఫోటోను సోషల్‌మీడియాలో పంచుకుంది.
“ప్రియమైన మోహన్‌లాల్ సార్.. మీతో కలిసి నటించడం ఒక వరంలా అనిపిస్తుంది. ప్రతిరోజు షూటింగ్‌లో, నేను సినిమాను మీ కళ్లతో చూస్తూ, మీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. మీరు నిజంగా గొప్ప ప్రతిభావంతులు సార్” అని వ్యాఖ్యలు రాసింది భాగ్యశ్రీ. ఈ చిత్రాన్ని దర్శకుడు విష్ణు మోహన్ తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఒక యధార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.