జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలి
- జంతర్‌మంతర్, ఇండియా గేట్ల వద్ద ఆప్ నేతల భారీ నిరసన ప్రదర్శన
- ఉద్రిక్తతకు దారి తీసిన ఆందోళన బస్సులను అడ్డుకున్న ఆప్ కార్యకర్తలు
- నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)(Chief Election Commissioner) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)(Aam Aadmi Party) ఢిల్లీలోని జంతర్ మంతర్, ఇండియా గేట్ పరిసరాల్లో ఆదివారం భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టింది.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఎన్నికల సంఘం పనితీరులో పారదర్శకత లోపించిందని ఆప్ ఈ ఆందోళన చేపట్టింది.
అక్రమాలకు బాధ్యత వహిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆప్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాగా ఆప్ నాయకులు, కార్యకర్తలు జంతర్ మంతర్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, ఢిల్లీ పోలీసులు భారీగా బారికేడ్లను ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. పలువురు ముఖ్య నాయకులను, నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సుల్లో తరలించారు.
కాగా ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్ 2, గాంధీ జయంతి నుంచి ఆందోళన కొనసాగిస్తోంది. అయితే ఆదివారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆప్ నేతలు బ్యారికేడ్లు ఎక్కి మరీ జంతర్ మంతర్ వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ తలెత్తింది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆప్ కార్యకర్తలతోపాటు ఆ పార్టీ విద్యార్థి విభాగం ఏఎఎస్ఏపీ కూడా ఆందోళనల్లో పాల్గొంటోంది. నిరసన కార్యక్రమంలో భాగంగా చుట్టుపక్కల ప్రాంతాల్లోని రోడ్లను కార్యకర్తలు బ్లాక్ చేశారు. బస్సుల్ని కూడా కదలనివ్వలేదు.
ఈ నేపథ్యంలో ఆందోళనకారుల్ని అడ్డు తొలగించేందుకు పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు, ఇతర విభాగాల భద్రతా బలగాలు ప్రయత్నించాయి. దీంతో నిరసనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఆందోళనల్లో ఢిల్లీ ఆప్ చీఫ్ సౌరభ్ భరద్వాజ్, ఎమ్మెల్యే సంజీవ్ ఝా, నేహా బోరా వంటి కీలక నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో కొందరు బారికేడ్లు దాటి జంతర్‌మంతర్ వైపు దూసుకెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆందోళనల్ని అరికట్టేందుకు దాదాపు ఐదువేలకు మందికిపైగా పోలీసుల్ని మోహరించినట్లు తెలుస్తోంది.