కేసీఆర్ సీఎం కావాలని పాదయాత్ర
- మంథని నుంచి ఎర్రవల్లికి..
- ఐదు రోజుల తర్వాత చేరుకున్న అభిమానులు
- సాదరంగా ఆహ్వానించి వారితో ముచ్చటించిన మాజీ సీఎం
హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS chief KCR) తిరిగి సీఎం కావాలనే ఆకాంక్షతో ముగ్గురు యువకులు మంథని నుంచి పాదయాత్ర చేస్తూ ఆదివారం సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లిలో కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు.
తెలంగాణ ప్రగతి సాధకుడు కేసీఆర్ తిరిగి సీఎం కావడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి గాడిలో పడుతుందని, ఉద్యోగ ఉపాధి రంగాల్లో తెలంగాణ యువతకు అవకాశాలు మెరుగవుతాయని పాదయాత్ర చేసిన ముగ్గు రు యువకులు మంథని బెన్నిపాల్, బూర్ల వెంకటేశ్, కొండ వెంకటేశ్ తెలిపారు. ఆదివారం ఎర్రవల్లికి చేరుకున్న వారిని సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్.. వారితో కాసేపు ముచ్చటించారు. తనపట్ల వారు చూయించిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.
కాగా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయ డంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవ్వడమే గాక, పూర్తి విరుద్ధంగా పనిచేస్తున్నదనే విషయాన్ని ప్రజలు గ్రహించారని, తమ పాదయాత్ర సందర్భంగా ప్రజలతో వారి అనుభవాలను కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు.
కేసీఆర్ పాలనలో తాము అనుభవించిన పాలనా ఫలితాలను రాష్ట్ర ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని, కాంగ్రేస్ హామీలను నమ్మి మోసపోయి తాము ఏమి కోల్పోయామో అర్థం చేసుకున్నారని వారు తెలిపారు. మంథనితో పాటు, రాష్ట్ర ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్నే తిరిగి సీఎంగా నిలబెట్టుకోవడం ఖాయమని పాదయాత్ర చేసిన యువకులు స్పష్టం చేశారు.