చెన్నైలో సింగీతం అంత్యక్రియలు పూర్తి
భారతీయ సినీ రంగాన్ని తన విలక్షణమైన, ప్రయోగాత్మక చిత్రాలతో సరికొత్త పంథాలో నడిపించిన మహోన్నత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94)(Singeetam Srinivasa Rao) అంత్యక్రియలు చెన్నైలో ఆదివారం ముగిశాయి. శనివారం రాత్రి ఆయన మృతితో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో(South Indian film industry) ఒక సువర్ణ అధ్యాయం ముగిసినట్లయింది.
ఆదివారం మధ్యాహ్నం చెన్నైలోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. సినీ అభిమానులు, పరిశ్రమకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. చెన్నైలోని నేసపాక్కం శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా అంత్యక్రియల క్రతువును పూర్తి చేశారు.
కమల్ హాసన్, సినీ ప్రముఖుల నివాళులు
ఆదివారం ఉదయం సింగీతం శ్రీనివాసరావు పార్థివదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం చెన్నై విరుగంబాక్కంలోని ఆయన నివాసంలో ఉంచారు. ఆయనతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నటుడు కమల్ హాసన్ ఉదయమే విచ్చేసి నివాళులర్పించారు. సింగీతం భౌతికకాయాన్ని చూసి ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఎప్పటికీ యువకుడిలా, అచంచలమైన ఉత్సాహంతో ఉండేవారని కమల్ హాసన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. సింగీతం మృతి పట్ల చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాజమౌళి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సింగీతం మరణం భారతీయ చలనచిత్ర రంగానికి ఎప్పటికీ పూడ్చలేని తీరని లోటని వారు కొనియాడారు.
తీసిన ప్రతి సినిమా ఒక పాఠ్యపుస్తకం
ఈ నష్టం నాకు చాలా వ్యక్తిగతంగా అనిపిస్తోంది. నేను ఎదుగుతున్న రోజుల్లో సింగీతం శ్రీనివాసరావు నాకు ఇష్టమైన దర్శకులలో ఒకరు. ఆయన సినిమాల వెనుక ఉన్న కళాత్మకతను నేను పూర్తిగా అర్థం చేసుకోకముందే, వాటిని ఎంతో ఆశ్చర్యంతో చూసేవాడిని. నేను పెద్దయ్యాక, సినిమా రంగంలో భాగమైన కొద్దీ, ఆయనపై నా అభిమానం మరింత బలపడింది. ఆయన సినిమాను నిజంగా ప్రేమించిన వ్యక్తి. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక పాఠ్యపుస్తకం లాంటిది. నిజమైన దిగ్గజాన్ని కోల్పోయాం. కానీ ఆయన సినిమా చిరకాలం నిలిచి, తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు
సింగీతం ఆత్మకు శాంతి చేకూరాలి
సింగీతం శ్రీనివాసరావు కన్ను మూశారని తెలిసి విచారిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భారతీయ చలన చిత్ర పరిశ్రమకి విభిన్న చిత్రాలు అందించిన దర్శకుడాయన. పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మయూరి, ఆదిత్య 369, మైకేల్ మదన కామరాజు లాంటి చిత్రాల్లో సింగీతం చేసిన ప్రయోగాలు, చూపిన సృజన ప్రేక్షకులను మెప్పించాయి. 94 ఏళ్ల వయసులోనూ సింగ్ గీతం అనే చిత్రానికి దర్శకత్వం వహించడం ఆయనకి సినిమా పట్ల ఉన్న ఆసక్తిని తెలియచేసింది. సింగీతం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
పవన్‌కళ్యాణ్, డిప్యూటీ సీఎం, ఏపీ