పత్తి రైతుకు దక్కని ‘మద్దతు’!

05-10-2026 | 05:30am
  1. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం
  2. అధికారుల అలసత్వం వ్యాపారులకు వరం
  3. క్వింటాల్‌కు రూ.800 నుండి వెయ్యి వరకు నష్టపోతున్న రైతాంగం

కల్వకుర్తి అక్టోబర్ 4: వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటూ ఆరుతడి పంటగా పత్తిని సాగు(Cotton cultivation) చేసిన రైతులకు ఈ ఏడాది నిరాశే మిగులుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)(Minimum Support Price) 8667 రైతులకు అందకపోవడంతో పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభం కాకపోవడం ప్రైవేటు వ్యాపారులకు వరంగా మారింది.

జిల్లాలో ఈ ఏడాది సుమారు 3.2 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు అంచనా. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యధికంగా పత్తి సాగు జరిగింది. అయితే వర్షాభావ పరిస్థితులతో పంట ప్రారంభం నుంచే నీటి కొరతను ఎదుర్కొంది. దీంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి.

దళారుల దోపిడీ.. 

పత్తికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్కు రూ.8,667గా ఉండగా, ప్రస్తుతం పలువురు ప్రైవేటు వ్యాపారులు మాత్రం అత్యంత తక్కువ తేమ శాతం నమోదు అవుతున్నప్పటికీ రూ.7,800 నుంచి రూ.8,200 వరకు మాత్రమే చెల్లిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో రైతులు ఒక్కో క్వింట్పా సుమారు రూ.800 నుంచి వెయ్యి వరకు నష్టపోతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు అధిక దిగుబడి వస్తే కొంతైనా లాభం పొందవచ్చని ఆశించారు. కానీ వర్షాభావంతో దిగుబడి తగ్గిపోవడంతోపాటు మద్దతు ధర కూడా లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు.

నిల్వ చేసుకునే అవకాశం లేక..

చేతికొచ్చిన పత్తిని నిల్వ చేసుకునేందుకు తగిన వసతులు లేకపోవడం రైతులకు మరో సమస్యగా మారింది. పంటను ఎక్కువ కాలం నిల్వ చేసుకునే ఆర్థిక స్థోమత లేక పోవడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో సమీపంలోని వ్యాపారులకు పత్తిని విక్రయిస్తున్నారు. రైతుల పరిస్థితిని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు తూకాల్లోనూ  మోసాలకు పాల్పడుతూ మద్దతు ధర కంటే తక్కువకు పత్తిని కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

21 నుంచి సీసీఐ కొనుగోళ్లు.. 

పత్తి కొనుగోళ్లను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎల్నీనో ప్రభావంతో ఎండల తీవ్రత పెరిగి పత్తి కాయలు పగిలి ముందుగానే పత్తి చేతికొచ్చింది. ఇప్పటికే కూలీల కొరత కారణంగా రైతులు మరింత అప్పు చేసి మరి ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించి పత్తి తీయించారు.

సిసిఐ కొనుగోలు ప్రారంభించే దాకా భద్రపరచుకునే వెసులుబాటు లేకపోవడంతో గత్యంతరం లేక దళారులను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడిందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం అయ్యి సాధ్య అసాధ్యాలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 19 సీసీఐ కొనుగోలు కేంద్రాలను గుర్తించగా 17 కేంద్రాల్లో ప్రభుత్వ అనుమతులు వచ్చే అవకాశం ఉన్నది. కానీ వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తేనే పత్తి రైతులకు కొంత ఊరట నిస్తుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 

త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది..

ప్రస్తుత పరిస్థితులను గమనించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వానికి నివేదించాం. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. 

 నరేందర్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, నాగర్ కర్నూల్

మరిన్ని వార్తలు