సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం
ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్ నవంబర్ 11 (విజయక్రాంతి): నిలువ నీడలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం(Indiramma Housing Scheme) ప్రవేశపెట్టి పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలం మాదాపురం గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇళ్ల మంజూరు చేస్తూ, వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు భరోసా కల్పించే గొప్ప కార్యక్రమమని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.