సమిష్టితోనే అభివృద్ధి సాధ్యం
ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దుర్గేష్
మహబూబాబాద్,(విజయక్రాంతి): సమిష్టి తోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ(Mudiraj Mahasabha) ప్రధాన కార్యదర్శి నీలం దుర్గేష్ పిలుపునిచ్చారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని(World Fishermen's Day) పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘనంగా దుర్గేష్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. గ్రామాల్లో ముదిరాజు కులస్తులు పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు.
అనంతరం పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వృత్తిని నమ్ముకుని ఏండ్ల తరబడిగా జీవిస్తున్న ముదిరాజుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. కుల వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.
సంఘ సభ్యులు సంఘటితంగా ఉంటూ పరస్పర సహకారంతో అభివృద్ధి వైపు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలో పండగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు వెంకన్న, సత్యనారాయణ, పిచ్చయ్య, అశోక్, వెంకటేష్, శ్రీనాథ్, యాకయ్య, దసురు నాయక్, కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న, కౌన్సిలర్లు విజయ, ఉమ, వీరేష్ పాల్గొన్నారు.