అమ్మేసి.. కొంటున్నారు
- సీఎంఆర్ కోసం మిల్లర్ల పాట్లు
- ఇతర మిల్లర్ల నుంచి కొనేందుకు పోటీ
- ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల సీఎంఆర్ ధాన్యం బకాయి
- ప్రభుత్వ చర్యలతో ఉక్కిరిబిక్కిరి
మహబూబాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): సీఎంఆర్(Custom Milling Rice) కోసం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది రైస్ మిల్లర్లు పడరాని పాట్లు పడుతున్నారు. గత పదేళ్లుగా కొందరు రైస్ మిల్లర్లు అక్రమ మార్గాలను ఎంచుకొని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని అక్రమంగా అమ్ముకున్న మిల్లర్లు ఇప్పుడు ప్రభుత్వ చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. క్రిమినల్ కేసులు, అరెస్టులు, తరచుగా తనిఖీలు, రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేస్తుండటంతో ఈ గొడవల నుంచి బయటపడేందుకు ప్రభుత్వానికి బకాయి పడ్డ సీఎంఆర్ పెట్టడానికి నానాతంటాలు పడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2000 కోట్ల రూపాయలకు పైగా ధాన్యం బకాయి పడ్డ మిల్లర్లు ఇప్పుడు బియ్యం పెట్టడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అప్పట్లో ధాన్యం అమ్ముకున్న కొం దరు మిల్లర్లు ఇప్పుడు ఇతర మిల్లర్ల నుంచి ధాన్యం, బియ్యం కొంటున్నట్లు ప్రచారం సాగుతోంది. డిఫాల్ట్, టెండర్ ప్యాడీ బకాయి పడ్డ మిల్లర్లతోపాటు 2022- నుంచి 2025 వానాకాలం సీజన్ వరకు సీఎంఆర్ బకాయిల వసూళ్లకు ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
సీఎంఆర్ బకాయిల వసూళ్ల కోసం ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసింది. దీనికి తోడు తాజాగా ఉన్నతస్థాయి అధికారులను ప్రతి జిల్లాకు ఒకరి చొప్పున నియమించింది. వీరికి ప్రత్యేక టార్గెట్లు నిర్దేశించి, బకాయి సీఎంఆర్ బియ్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించింది. దీనితో ప్రతిరోజు సివిల్ సప్లై కార్పొరేషన్, సివిల్ సప్లై అధికారులు మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తూ, సీఎంఆర్ సేకరణని వేగవంతంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టారు.
బియ్యం కోసం మిల్లర్ల మధ్య పోటీ
సీఎంఆర్ చెల్లించడానికి బియ్యం కోసం రైస్ మిల్లర్ల మధ్య విపరీతమైన పోటీ పెరిగినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభుత్వం కేటాయించిన ధాన్యం విక్రయించుకున్న మి ల్లర్లు కొందరు ప్రస్తుతం వరి కోతలు ప్రారంభం కావడంతో సన్నధాన్యం కోసం, ఇంకోవైపు బియ్యం కోసం పోటీ పడుతున్నారు.
ధరల పెరుగుదలకు కారణం ఇదే!
రాష్ట్రంలో ప్రస్తుతం బియ్యం ధరల పెరుగుదలకు మిల్లర్ల మధ్య పోటీనే కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వం గత వాన కాలంలో రైతుల నుంచి సన్నధాన్యాన్ని క్వింటాలుకు రూ.2,400, 500 బోనస్ కలిపి పండించిన పంటలో 70శాతం కొనుగోలుచేసి, మిల్లర్లకు సీఎంఆర్ కోసం కేటాయించింది. అయితే చాలామంది మిల్లర్లు ఇతర రాష్ట్రాలకు అమ్శేశా రు. ఇప్పుడు ప్రభుత్వ ఒత్తిడితో బియ్యం లేదం టే ధాన్యం కొనుగోళ్ల కోసం పోటీ పడుతుండడంతో ఒక్కసారిగా ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.
ఎల్ నినో పరిస్థితులు మరో కార ణమంటున్నారు. ప్రైవేట్ ట్రేడర్లు గత వానా కాలంలో గరిష్టంగా సన్న ధాన్యం రూ.2,600, 2,700 లకు మించి కొనుగోలు చేయలేదని, ఆ ధాన్యాన్ని ఇప్పుడు పడితే, గరిష్టంగా 42 రూపాయలకు విక్రయించాల్సి ఉంటుందని, ధాన్యానికి డిమాండ్ పెరగడంతో ఇప్పుడు కిలో బియ్యం 66 రూపాయలకు పైగా ధర పెరగడానికి కారణమైందని కొందరు మిల్లర్లే చెపుతున్నారు.
బియ్యం లెక్క ఇది!
2,700కు క్వింటాల్ చొప్పున సన్నరకం ధాన్యం కొన్న మిల్లర్లు బియ్యం పట్టిస్తే వ చ్చే అవుట్ టర్న్ లెక్క ఇది. 60 నుంచి 62 కేజీల బియ్యం వస్తాయి. 7 కిలోల వరకు తవుడు వస్తుంది. రెండు కిలోల వరకు పరం వస్తుంది. 6 కిలోల వరకు నూకలు వస్తాయి. అదనంగా ఊక లభిస్తుంది. ఈ లెక్కన బియ్యం, తవుడు, పరం, నూకల విలువ లెక్కించినా బియ్యం ధర క్వింటాలకు గరిష్టంగా 4,200 రూపాయలకు మించి ఉండొద్దు. మిల్లర్ల మధ్య పోటీతో ధాన్యం కొరత కారణంగా బియ్యం ధరలకు అమాంతం రెక్కలు వచ్చినట్లు చెబుతున్నారు.