సారోస్తేనే.. చదువు!?

09-10-2026 | 05:20am

‘షటిల్’ సర్వీస్‌లలో ప్రభుత్వ ఉపాధ్యాయులు

గాడితప్పిన విద్యావ్యవస్థ 

విద్యార్థుల భవిష్యత్ అంధకారం

మహబూబాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా(Warangal District)లో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ తీరు గాడి తప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు క్రమశిక్షణ, సమయ పాలన నేర్పించాల్సిన కొందరు ఉపాధ్యాయులే దారి తప్పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విధి నిర్వహణను విస్మరించి, సమయపాలన పక్కనపెట్టి పాఠశాలకు ‘మొక్కుబడి’గా వచ్చి వెళుతున్నారని, షటిల్ సర్వీసులకు ప్రాధాన్యమిస్తుండటంతో ప్రభుత్వ విద్యాసంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.

‘టైం’ దాటాకే బడికి.. గంట కొట్టకముందే ఇంటికి!

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో పని చేస్తున్న పలువురు ఉపాధ్యాయులు కనీస సమయపాలన పాటించడం లేదు. ఉదయం పాఠశాల ప్రారంభ సమయం దాటిపోయినా విధులకు హాజరుకావడం లేదు. అటు సాయంత్రం పాఠశాల ముగింపు గంట కొట్టడానికి ముందే, విద్యార్థులను తరగతి గదుల్లోనే వదిలేసి ఇళ్లకు బయలుదేరుతున్నారు. బడి తెరిచే సమయానికి ఉపాధ్యాయులు లేకపోవడం, మూసే సమయానికి ముందే వెళ్లిపోతుండటంతో స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలలు వదిలి.. ‘షటిల్’ సర్వీసుల్లో బిజీ!

దూర ప్రాంతాల నుండి రాకపోకలు సాగించే కొందరు ఉపాధ్యాయులు రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వీరంతా ఒక జట్టుగా ఏర్పడి ‘షటిల్’ సర్వీసుల తరహాలో ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటున్నారు. వాహనాల సమయానికి అనుగుణంగా పాఠశాలల వేళలను మార్చేస్తూ, విద్యాశాఖ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ప్రయాణాల హడావుడి లోనే సగం సమయం గడిచిపోతుండటం తో, విద్యార్థులకు నాణ్యమైన బోధన అం దడం లేదు. బస్సు, రైళ్లు వచ్చే విశేషాలను ప్రత్యేకంగా ‘వాట్సాప్’ గ్రూప్ ద్వారా పరస్పరం తెలియజేసుకుంటున్నట్లు చెబుతున్నా రు. మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉద యం పూట రైళ్లను అధికంగా షటిల్ సర్వీసులకు వినియోగిస్తూ ఉండడమే ఇందుకు నిదర్శనగా చెప్పవచ్చు.

గాడితప్పిన నిర్వహణ.. పర్యవేక్షణ కరవు

కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరి కారణంగా పలు జిల్లాల్లో విద్యావ్యవస్థ పూర్తిగా గాడితప్పిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. పాఠశాలల్లో విద్యా ప్రమా ణాలు పడిపోవడమే కాకుండా, విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపిస్తోంది. ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపించడం, ఎఫ్ ఆర్ ఏ హాజరు విధానాన్ని సమర్థవంతంగా అ మలు చేయకపోవడం వల్లే కొందరు టీచర్లు ఈవిధంగా యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వరంగా మారిన మహాలక్ష్మి పథకం

ఇక కొందరు మహిళా ఉపాధ్యాయులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వరంగా మారింది. గతంలో చార్జీలు చెల్లించి పాఠశాలలకు వచ్చి వెళ్లే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని సద్వినియోగం చేసుకున్న మహిళా ఉపాధ్యాయుల కొందరు సకాలంలో పాఠశాలకు రావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అనేక చోట్ల మారుమూల ప్రాంతాల్లో పాఠశాలల వేళలను బస్సు వచ్చే సమయానికి మార్చారని, దీనితో ఆలస్యంగా ఉదయం పూట బడికి రావడం, సాయంత్రం బడి ముగిసే సమయానికి అరగంట నుండి 45 నిమిషాల ముందే వెళ్లిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 

తక్షణ చర్యలు అవసరం

ప్రభుత్వ పాఠశాలలను నమ్ముకుని పేద విద్యార్థులు తమ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఉపాధ్యా యుల సమయపాలన రాహిత్యం వారి జీవితాలతో ఆడుకోవడమే అవుతుంది. ఇప్పటి కైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందిం చి, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు