పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలి
రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకటేష్ డిమాండ్
జడ్చర్ల, నవంబర్ 21: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్(Nalgonda Municipal Corporation) పరిధిలోని 45వ డివిజన్లో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న దళిత మహిళా కార్మికురాలు చందుపట్ల రమణమ్మపై దాడి చేసిన బాలకృష్ణ అనే వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకటేష్ డిమాండ్ చేశారు.
ఇంటి నిర్మాణ పనుల సందర్భంగా ఏర్పడిన మట్టిని తొలగించలేదనే కారణంతో రమణమ్మపై బాలకృష్ణ కర్రతో దాడి చేసి కాళ్లపై తీవ్రంగా కొట్టినట్లు తెలిపారు. విధులు నిర్వహిస్తున్న మహిళా కార్మికురాలిపై దాడి చేయడం అమానుషమని, ఈ ఘటనను రాష్ట్ర సీఐటీయూ, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా ఖండించాయని పేర్కొన్నారు.
ఈ ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు ఇచ్చిన పిలుపులో భాగంగా జడ్చర్ల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పట్టణ కమిటీ ఉపాధ్యక్షురాలు అంజమ్మ ఆధ్వర్యంలో కార్మికులు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులపై దాడులను సహించేది లేదని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా మున్సిపాలిటీల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోశాధికారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణ, విద్యాసాగర్, మహేష్, సహాయ కార్యదర్శి రమేష్, వెంకటమ్మ, బాలమ్మ, యాదమ్మ, రసూల్ బీ, లక్ష్మమ్మ, కేశవులు, వెంకటయ్య, శివరాజుతో పాటు పలువురు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.