బస్సు లేక చదువు దూరం!
పేద విద్యార్థుల చదువుకు రవాణా కష్టాలు..
చింతలకుంటమాచర్లగట్టు మార్గంలో ఆర్టీసీ బస్సు నడపాలి
గట్టు అక్టోబర్ 28: చదువుకోవాలనే తపన ఉంది.. కళాశాలకు వెళ్లాలనే పట్టుదల ఉంది.. కానీ వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం లేదు! ఈ రవాణా కష్టాలే గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల(Gattu Government Junior College) విద్యార్థులకు అడ్డంకిగా మారుతున్నాయి. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రజా రవాణా సౌకర్యం లేకపోవడం సమస్యగా మారగా, ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
గట్టు మండలంలోని చింతలకుంట, మాచర్ల, బల్లెరతో పా టు ఎల్లందొడ్డి,తారాపురం, కొత్తపల్లి, అంతంపల్లి, చమన్ ఖాన్ దొడ్డి, గొర్లఖాన్ దొడ్డి, తప్పెట్ల మరుసు,గంగిమన్ దొడ్డి, పెంచికలపాడు, సల్కాపురం తదితర గ్రామాల నుంచి విద్యార్థులు గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చి చదువుకుంటున్నారు. వీరిలో చింతలకుంట గ్రామం నుంచే సుమారు 60 మంది, మాచర్ల, బల్లెర పరిసర గ్రామాల నుంచి మరో 60 మంది వరకు విద్యార్థులు కళాశాలకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతమంది విద్యార్థులు ఆధారపడే మార్గంలో సరైన ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం వారి చదువుకు సమస్యగా పరిణమించింది.
నెలకు రూ.1,000 ఆటో కిరాయి.. పేద కుటుంబాలకు అదనపు భారం!
కళాశాలకు వెళ్లాలంటే విద్యార్థులు ప్రైవేటు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నెలకు సుమారు రూ.1,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ అదనపు వ్యయం భారంగా మారుతోంది. రోజువారీ కుటుంబ అవసరాలకే కష్టపడుతున్న తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం రవాణా ఖర్చును భరించలేక ఇబ్బందులు పడుతున్నారు.ఆటో కిరాయి చెల్లించలేని విద్యార్థులు కాలినడకన వెళ్లడం, ఇతర వాహనాలను లిఫ్ట్ అడిగి కళాశాలకు చేరుకోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రవాణా సౌకర్యం లేక కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను కళాశాలకు పంపలేకపోతున్నారని,దీంతో విద్యార్థుల చదువు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తమవుతోంది.
బస్సు సౌకర్యం కల్పిస్తేనే విద్యకు భరోసా!
విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలంటే కళాశాలలు ఉండటమే కాదు.. వాటికి చేరుకునేందుకు రవాణా సౌకర్యం కూడా ఉండాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఎంతో అవసరం. సరైన బస్సు లేకపోవడం వల్ల విద్యార్థులు ఆర్థిక భారాన్ని మోయాల్సి రావడం, కళాశాల హాజరుపై ప్రభావం పడే పరిస్థితులు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది.ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి కళాశాల సమయాలకు అనుగుణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో చింతలకుంటమాచర్లగట్టు మార్గంలో ఆర్టీసీ బస్సును నడపాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం కోరుతున్నారు.
ఈ సౌకర్యం కల్పిస్తే విద్యార్థులపై ఆటో కిరాయి భారం తగ్గడమే కాకుండా కళాశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే అవకాశం పెరుగుతుంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇది కేవలం బస్సు సౌకర్యం కోసం చేస్తున్న విజ్ఞప్తి మాత్రమే కాదు.. పేద విద్యార్థుల చదువు ఆగిపోకుండా చూడాలనే ఆకాంక్ష.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించి గ్రామీణ విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.