అయ్యప్ప మాల ధరించారని విధులకు దూరం!
రెయిన్‌బో పాఠశాల యాజమాన్యం నిర్వాహకం
పాఠశాల ఎదుట అయ్యప్ప భక్తుల ఆందోళన
విద్యాశాఖ, పోలీసు అధికారులు స్పందించాలని భక్తుల డిమాండ్
అమీన్‌పూర్, నవంబర్ 4: అయ్యప్ప మాల ధరించినందుకు పాఠశాలలో హెల్పర్‌గా పనిచేస్తున్న నాగరాజును రెండు నెలల పాటు విధులకు రావొద్దని యాజమాన్యం చెప్పినట్లు ఆరోపణలు రావడంతో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ డివిజన్ బీరంగూడ పరిధిలోని రెయిన్‌బో ఇంటర్నేషనల్ స్కూల్(Rainbow International School) ఎదుట బుధవారం అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. దీక్ష తీసుకోవడం వ్యక్తిగత మత విశ్వాసానికి సంబంధించిన విషయమని, దాని కారణంగా ఉపాధికి ఆటంకం కలిగించడం సరికాదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాలలో హెల్పర్‌గా పనిచేస్తున్న నాగరాజు అయ్యప్ప దీక్ష స్వీకరించి మాల ధరించడంతో యాజమాన్యం తనను విధుల్లోకి అనుమతించలేదని, రెండు నెలల పాటు పనికి రావొద్దని వెనక్కి పంపించిందని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాఠశాల ఎదుటకు చేరుకుని బైఠాయించి నిరసన తెలిపారు. మత విశ్వాసాలను గౌరవించాలని, ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అధికారులు స్పందించాలని డిమాండ్
ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు, పోలీసులు స్పందించి వాస్తవాలను పరిశీలించాలని అయ్యప్ప భక్తులు కోరారు. ఉద్యోగి ఆరోపణలు, పాఠశాల యాజమాన్యం వివరణను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పాఠశాల యాజమాన్యం వివరణ, అధికారుల తదుపరి చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది.