బాణసంచా దుకాణాల యజమానులకు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన
భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: సీఐ జలంధర్ రెడ్డి
మేడిపల్లి, నవంబర్ 4 (విజయక్రాంతి); బాణసంచా విక్రయాల సమయంలో తీసుకోవాల్సిన అగ్నిప్రమాద నివారణ చర్యలు, భద్రతా ప్రమాణాలపై సీఐ జలంధర్ రెడ్డి(CI Jalandhar Reddy) అవగాహన కల్పించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో బుధవారం సాయంత్రం 45 మంది బాణాసంచా వ్యాపారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యాపారం ప్రారంభించే ముందు అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖల నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని సూచించారు.
ప్రతి దుకాణంలో తగినంత నీరు, ఇసుక బకెట్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు తదితర అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, సంబంధిత శాఖలు నిర్దేశించిన అన్ని భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి దుకాణ యజమాని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఐ జలంధర్ రెడ్డి సూచించారు.