ఎన్హెచ్ఎం ఉద్యోగులకు బీజేపీ అండ
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల కలెక్టరేట్(Mancherial Collectorate) ముందు ఎన్హెచ్ఎం ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చేస్తున్న ధర్నా కార్యక్రమానికి బీజేపీ నాయకులు గురువారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్హెచ్ఎం ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యోగుల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మంచిర్యాల కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ముఖేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు కమలాకర్రావు, పట్టి వెంకటకృష్ణ, జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్, నస్పూర్ జోన్ అధ్యక్షుడు కుర్ర చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.