జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనను ఘనంగా నిర్వహించాలి

28-11-2026 | 05:30pm

లక్షెట్టిపేట, నవంబర్ 28 (విజయక్రాంతి): విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం (Scientific Temper), సృజనాత్మకత (Creativity), నూతన ఆవిష్కరణల (Innovations) పట్ల ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించనున్న జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి, ఘనంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి చంద్రయ్య సూచించారు.

శనివారం పట్టణంలోని స్థానిక జూనియర్ కళాశాలలో విజ్ఞాన ప్రదర్శన నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. నిర్వహణ కమిటీ కో-కన్వీనర్‌తో పాటు సభ్యులు సమన్వయంతో పనిచేసి, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రదర్శన జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ ప్రదర్శనలో నాలుగు విభాగాల నుంచి మొత్తం 521 ప్రాజెక్టులు (Exhibits) ప్రదర్శనకు రానున్నట్లు తెలిపారు. 521 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించనున్న నేపథ్యంలో వారికి మార్గదర్శకులుగా వ్యవహరించే గైడ్ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని వివరించారు.

విద్యార్థుల బస కోసం బాలికలు, బాలురకు వేర్వేరుగా పలు పాఠశాలల్లో వసతి ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్ఓ రాజగోపాల్, ఎంఈఓ శైలజ, నస్పూర్ ఎంఈఓ చౌదరి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణరావు, ఎస్ఓ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు