అలైన్ మెంట్ ను నిరసిస్తూ బాధితుల ఆందోళన
హాజీపూర్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలో ఎన్హెచ్-63 జాతీయ రహదారి(National Highway 63 (NH-63)) విస్తరణలో భాగంగా రైతుల నుంచి ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఏకపక్షంగా కొత్త అలైన్మెంట్ ఖరారు(Alignment finalized) చేస్తూ గెజిట్ విడుదల చేయడంపై హాజీపూర్, లక్షెట్టిపేట మండలాలకు చెందిన బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధ వారం హాజీపూర్ మండలం దొనబండ శివారులో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎన్హెచ్-63 రహదారికి సంబంధించి 2018లో నోటిఫికేషన్ విడుదల కాగా, 2023లో గెజిట్ ప్రక్రియ పూర్తయిన అనంతరం అలైన్మెంట్లో మార్పులు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైతుల అభిప్రాయాలు, అనుమతులు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
కొందరి సంతకాలను అనుమతి లేకుండా తీసుకుని నోటీసులు జారీ చేస్తున్నారంటూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని రైతులు ఎల్లంపల్లి ప్రాజెక్టు కారణంగా తమ భూములను కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. మరోసారి జాతీయ రహదారి విస్తరణ పేరుతో భూములు కోల్పోవాల్సి వస్తే తమ జీవనాధారం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఒకసారి భూములు త్యాగం చేసిన తమకు మరోసారి భూములు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. 2018లో ప్రతిపాదించిన పాత రహదారి మార్గాన్నే కొనసాగించాలని, ప్రస్తుతం ప్రతిపాదించిన కొత్త అలైన్మెంట్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తమ సమస్యపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పందించి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టే పరిస్థితి వచ్చే వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేశారు.
రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న హాజీపూర్, లక్షెట్టిపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. బాధిత రైతుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. తమ భూముల పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాటం కొనసాగిస్తామని, ప్రాణాలు పోయినా భూములు మాత్రం ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు.