యూనివర్సిటీ స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన మేయర్
మంచిర్యాల స్పోర్ట్స్, (విజయక్రాంతి) : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్(Mancherial Municipal Corporation) పరిధిలోని ఉషోదయ పాఠశాల క్రీడా మైదానంలో సీవీ రామన్ డిగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకతీయ యూనివర్సిటీ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ బుధ వారం డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ తో కలిసి క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో క్రీడాకారులందరూ తమ ప్రతిభను చాటుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా పేరును రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిలబెట్టాలని మేయర్ ఆకాంక్షించారు.
క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం అందించడం ద్వారా క్రీడారంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని నాలుగు జిల్లాలకు చెందిన వివిధ కళాశాలల క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంగవరపు వెంకటేశ్వర్లు, తాళ్ళ సంపత్ రెడ్డి, సీవీ రామన్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సయ్య, వెంకట రమణ, అధ్యాపకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.