వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
చదువుల వరదాయినిగా వనదుర్గమ్మ
వైభవోపేతంగా కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం
రేపు లలితా త్రిపుర సుందరి రూపంలో వనదుర్గమ్మ
పాపన్నపేట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల్లో కొలువుదీరిన వనదుర్గమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం అమ్మవారు చదువుల తల్లి సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లని వస్త్రధారణలో, వీణ, హంసల అలంకరణతో అమ్మవారిని సుందరంగా ముస్తాబు చేశారు. సరస్వతీ దేవి అలంకరణలో వనదుర్గమ్మను దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
‘మమ్మేలు మాయమ్మ.. ఏడుపాయల వనదుర్గమ్మ’ అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ప్రత్యేక పూజలు, అమ్మవారి అలంకరణలతో సందడిగా సాగుతున్నాయి.
రేపు లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనం
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం సప్తమిని పురస్కరించుకుని వనదుర్గమ్మ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని నారింజ రంగు వస్త్రాలతో అలంకరించనున్నట్లు ఆలయ అర్చకులు, సిబ్బంది తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.