అనురాగ్ యూనివర్సిటీ రోవర్ ఫీల్డ్ టెస్టింగ్ విజయవంతం
ఘట్ కేసర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : సాంకేతిక పరిజ్ఞానాన్ని(technological knowledge) ఆచరణాత్మక అనుభవంతో అనుసంధానిస్తూ, బహుళ విభాగాల సమన్వయంతో వినూత్న పరిశోధన దిశగా అనురాగ్ యూనివర్సిటీ(Anurag University) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అనురాగ్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎ. మల్లికార్జున రెడ్డి, డాక్టర్ కె. ఆనంద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లూమూస్ బృందంతో కలిసి బద్వేలు, ఆంధ్రప్రదేశ్‌లోని ఎనర్జీస్ విండ్ ఫామ్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా విండ్ టర్బైన్ బ్లేడ్లపై రోవర్‌ను విజయవంతంగా ఫీల్డ్ టెస్టింగ్ నిర్వహించారు. ఈ ప్రదర్శన ద్వారా రోవర్ నిర్వహణ, క్షేత్రస్థాయి పరీక్షలు, వాస్తవ పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విధానంపై బృందానికి విలువైన ఆచరణాత్మక అవగాహన లభించింది.
ఈ ప్రాజెక్టులో బహుళ విభాగాల సమన్వయం కీలక పాత్ర పోషించింది. ఏఐఎంఎల్, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులతో పాటు 3డి ప్రింటింగ్ బృందం, అనురాగ్ సాట్ బృందం రోవర్ రూపకల్పన, అభివృద్ధి, పరీక్షల వివిధ దశల్లో తమ సాంకేతిక నైపుణ్యాలను అందించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల ప్రతిభావంతులైన విద్యార్థుల భాగస్వామ్యాన్ని సులభతరం చేసిన సంబంధిత హెచ్ఓడీలు, డీన్లకు కృతజ్ఞతలు తెలిపారు.