అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా!

10-10-2026 | 09:32pm

బోడుప్పల్ సర్కిల్‌లో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

జీ ప్లస్‌ 2 అనుమతులతో అదనపు అంతస్తుల నిర్మాణం

నివాస భవనాల్లో వాణిజ్య కార్యకలాపాలు

సెట్‌బ్యాక్‌ నిబంధనలకూ తిలోదకాలు

పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు

మేడిపల్లి,(విజ‌య‌క్రాంతి): మున్సిపల్‌ అనుమతులు ఒకలా.. క్షేత్రస్థాయిలో నిర్మాణాలు మరోలా అన్న చందంగా బోడుప్పల్‌ సర్కిల్‌లో భవన నిర్మాణాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌(Malkajgiri Municipal Corporation) పరిధిలోని బోడుప్పల్‌ సర్కిల్‌లో కొందరు నిర్మాణదారులు నిబంధనలను పక్కనపెట్టి, అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు తగిన స్థాయిలో పర్యవేక్షణ చేపట్టడం లేదనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

భవన నిర్మాణాల విషయంలో నిబంధనల అమలు ప్రశ్నార్థకంగా మారుతోందనే ఆరోపణలు ఉన్నాయి. జీ ప్లస్‌ 2 (గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులు) నిర్మాణానికి అనుమతులు తీసుకుని, అదనంగా మరో అంతస్తు నిర్మిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అనుమతించిన అంతస్తుల పరిమితిని దాటి నిర్మాణాలు చేపడితే భవిష్యత్తులో భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే సమయంలోనే కాకుండా, నిర్మాణ పనులు కొనసాగుతున్న దశలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, గృహ వినియోగం కోసం అనుమతులు పొందిన కొన్ని భవనాలను వాణిజ్య కార్యకలాపాలకు అనుగుణంగా నిర్మిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవన వినియోగంలో మార్పులు చేసినప్పుడు సంబంధిత నిబంధనలు, అవసరమైన అనుమతులు పాటించాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు లేదా వినియోగ మార్పులు జరుగుతున్నాయా? అన్న అంశంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాల్సిన అవసరం ఉంది.  భవన నిర్మాణాలకు సంబంధించి పాటించాల్సిన సెట్‌బ్యాక్‌ నిబంధనలను కొందరు నిర్మాణదారులు విస్మరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

భవనం చుట్టూ నిబంధనల ప్రకారం ఖాళీ స్థలం వదలకపోతే గాలి, వెలుతురు, పార్కింగ్‌, అత్యవసర పరిస్థితుల్లో రాకపోకలు వంటి అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇలాంటి ఉల్లంఘనలను నిర్మాణ దశలోనే గుర్తించి అడ్డుకోవాల్సిన బాధ్యత సంబంధిత మున్సిపల్‌ అధికారులపై ఉంది. నిర్మాణ నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు, ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలిన నిర్మాణాలపై నోటీసులు జారీ చేశారా? క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరుగుతోందన్న సందేహాలనూ వారు లేవనెత్తుతున్నారు.

బోడుప్పల్‌ సర్కిల్‌ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు, వాస్తవ నిర్మాణాల మధ్య వ్యత్యాసాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతి పత్రాలను క్షేత్రస్థాయి నిర్మాణాలతో సరిపోల్చి, ఉల్లంఘనలు ఉన్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపల్‌ ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించి, బోడుప్పల్‌ సర్కిల్ ప‌రిధిలో నిర్మాణాలపై వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అనుమతులకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా చూడటంతో పాటు, నిబంధనల ఉల్లంఘనలపై సముచిత చర్యలు తీసుకున్నప్పుడే పట్టణ ప్రణాళికపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.

మరిన్ని వార్తలు